అమెరికా జైలులో తెలుగు యువ‌కుడి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

  • అత్యాచారం కేసులో అమెరికా జైలులో శిక్ష అనుభ‌విస్తున్న సాయికుమార్
  • అత‌నిది జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న‌పురం మండ‌లం నెల్లుట్ల‌
  • ప‌దేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డ్డ తెలుగు యువ‌కుడు
  • 15 ఏళ్ల బాలుడిగా న‌టిస్తూ ముగ్గురు బాలిక‌ల‌పై అఘాయిత్యం
  • ఈ కేసులో అత‌నికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు
  • మ‌నో వేద‌న‌తో జులై 26న ఆత్మ‌హ‌త్య చేసుకున్న సాయికుమార్
అత్యాచారం కేసులో అమెరికా జైలులో శిక్ష అనుభ‌విస్తున్న తెలుగు యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ముగ్గురు బాలిక‌ల‌పై అత్యాచారానికి పాల్ప‌డిన కేసులో జైలులో ఉన్న‌ జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న‌పురం మండ‌లం నెల్లుట్ల‌కు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) జులై 26న   కారాగారంలోనే  ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... నెల్లుట్ల‌కు చెందిన ఉప్ప‌ల‌య్య‌, శోభ దంప‌తుల కుమారుడు సాయికుమార్ ప‌దేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అక్క‌డే ఉద్యోగం చేస్తూ ఒక్ల‌హామా రాష్ట్రంలోని ఎడ్మండ్ లో భార్య‌తో క‌లిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో 15 ఏళ్ల బాలుడిగా న‌టిస్తూ ముగ్గురు బాలిక‌ల‌పై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. 

అలాగే త‌న‌తో శారీర‌క సంబంధానికి అంగీక‌రించ‌ని మ‌రో 19 మంది బాలిక‌ల అస‌భ్య చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ మేర‌కు బాధితులు అక్క‌డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 2023 అక్టోబ‌ర్‌లో సాయికుమార్‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

పోలీసుల ద‌ర్యాప్తులో సాయికుమార్‌పై ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని తేలింది. ఈ కేసులో దోషిగా తేలిన అత‌నికి ఈ ఏడాది మార్చి 27న అమెరికా కోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మాన‌సిక వేద‌న‌కు గురైన సాయికుమార్ జులై 26న జైలులోనే ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దాంతో అత‌ని కుటుంబ స‌భ్యులు అమెరికాకు వెళ్లి, అక్క‌డే అంత్య‌క్రియ‌లు పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం.   


More Telugu News