నెల సంపాదన రూ.1.8 లక్షలు.. కార్పొరేట్ ఉద్యోగులనే మించిన ముంబ‌యి వంటవాడు!

  • ఒక్కో ఇంట్లో 30 నిమిషాల పనికి రూ.18 వేల ఛార్జ్
  • ఒకే బిల్డింగ్‌లో 10 నుంచి 12 ఇళ్లలో వంట
  • కార్పొరేట్ జీతాలను మించిన ఆదాయంపై నెట్టింట చర్చ
  • మారుతున్న ఉద్యోగాల తీరుకు ఇది నిదర్శనమంటున్న నెటిజన్లు
ముంబ‌యిలో ఓ వంట మనిషి నెల సంపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగుల జీతాలను మించి నెలకు ఏకంగా రూ.1.8 లక్షల వరకు ఆర్జిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతని పని విధానం, ఆదాయ వివరాలు తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఆయుషి దోషి అనే ఓ న్యాయవాది తన ఇంట్లో పనిచేసే వంట మనిషి (స్థానికంగా 'మహారాజ్' అంటారు) గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వంటవాడు ఒక్కో ఇంట్లో కేవలం 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తాడు. ఇందుకుగానూ నెలకు రూ.18,000 వసూలు చేస్తాడు. ప్రయాణ సమయం వృథా కాకుండా ఉండేందుకు, ఒకే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని 10 నుంచి 12 ఇళ్లలో పనిచేస్తున్నాడు.

ఈ లెక్కన అతని నెలసరి ఆదాయం దాదాపు రూ.1.8 లక్షలకు పైమాటే. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఉచితంగా భోజనం, టీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. జీతం సమయానికి ఇవ్వాలి. ఇన్ని వున్నా కూడా తనకు ఇష్టం లేకపోతే చెప్పాపెట్టకుండా పని మానేస్తాడని కూడా ఆయుషి తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.

కొంతమంది ఈ సంపాదనపై అనుమానాలు వ్యక్తం చేయగా, మరికొందరు కార్పొరేట్ ఉద్యోగాల కన్నా ఇలాంటి నైపుణ్యం ఉన్న పనులే మేలంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ఆయుషి దోషి స్పందిస్తూ, ముంబైలోని మంచి ప్రాంతాల్లో ఇలాంటి జీతాలు సర్వసాధారణమేనని స్పష్టం చేశారు. "కేవలం కార్పొరేట్, గృహ సంబంధిత పనుల మధ్య పోలిక తీసుకురావడం నా ఉద్దేశం కాదు. మారుతున్న వృత్తిపరమైన పరిస్థితులను గుర్తించాలన్నదే అసలు విషయం" అని ఆమె వివరించారు. 


More Telugu News