Somireddy Chandramohan Reddy: లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారు: సోమిరెడ్డి

Somireddy criticizes Harish Rao on Lokesh comments about water sharing
  • నిన్న బనకచర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన లోకేశ్ 
  • హరీశ్ రావు విమర్శలు 
  • నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి  
  • 200 టీఎంసీలు వాడుకుంటామంటే తెలంగాణకు నష్టమేంటి? అంటూ ప్రశ్న
  • కేసీఆర్ ఇచ్చిన మాటను మరిచిపోవద్దని సూచన
గోదావరి నదిలో సముద్రంలోకి వృథాగా కలిసిపోతున్న మిగులు జలాలను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 2500 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు వరదల రూపంలో సముద్రంలో కలిసిపోతుండగా, కేవలం 200 టీఎంసీలను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకోవాలన్న ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ నేతలు ద్వేషభావంతో వ్యవహరించడం బాధాకరమని ఆయన అన్నారు."సముద్రంలో వృథాగా పోయే 3 వేల టీఎంసీల్లో 200 టీఎంసీలు వాడుకుంటామంటే తెలంగాణకు నష్టమేంటి? ఏపీ మంత్రి నారా లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారు?" అని సోమిరెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. 

గోదావరి నీటి వాటాలపై స్పష్టత ఉందని, 1540 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి 572 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు కలిపి 800 టీఎంసీలను కూడా వినియోగించలేకపోతున్నాయని ఆయన గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో 7.42 లక్షల ఎకరాలకు సాగునీరు, 2.58 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, 80 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని అందించాలన్నది ఏపీ లక్ష్యమని సోమిరెడ్డి వివరించారు. 

"గోదావరి జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ ఇచ్చిన మాటను మరిచిపోవద్దు. ఒక్క చుక్క నీరు ఇవ్వమని హరీశ్ రావు చెప్పడం బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 450 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారని, అయినా ఏపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, అలాగే తెలంగాణలో ఇతర ప్రాజెక్టులపైనా వ్యతిరేకత వ్యక్తం చేయలేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. "తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఏపీ ప్రజలను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా చూడవద్దు. రాష్ట్రం విడిపోయినా మన మధ్య బేధాలెందుకు?" అని తెలంగాణ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు మంచి మనస్సుతో సహకరించాలని, రెండు తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా అభివృద్ధి సాధించాలని సోమిరెడ్డి కోరారు. "మిగులు జలాలతో కరవు పీడిత రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే మా ఆకాంక్ష. కేసీఆర్ తో కలిసి మేమంతా ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశాం...స్నేహితులుగా మెలిగాం. తెలంగాణ సోదరులు ఆలోచించండి...దయచేసి మమ్మల్ని ద్వేషించకండి.. తెలంగాణ సోదరులు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించి, ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించవద్దు" అని కోరారు. 

"కేసీఆర్ మాత్రం రతనాల సీమను చేస్తానంటే... హరీశ్ రావు మాత్రం ఒక్క చుక్క కూడా ఇవ్వమంటున్నారు. సోదరులారా... రాజధాని, రెవెన్యూ పోగొట్టుకుని తంటాలు పడుతున్న మాపైనా మీ ప్రతాపం! తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులందరూ మంచి మనస్సు చేసుకుని మమ్మల్ని అర్థం చేసుకోండి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ముగ్గురూ కూర్చుని ఒక మంచి మాట చెబుతారని ఆశిస్తున్నాం" అని సోమిరెడ్డి పేర్కొన్నారు.
Somireddy Chandramohan Reddy
Andhra Pradesh
Telangana
Godavari River
Banakacherla Project
Nara Lokesh
Harish Rao
water sharing
irrigation projects
Rayalaseema

More Telugu News