అత‌ని కోసం నా కుమారుడికి అన్యాయం.. ఇది ఏ మాత్రం మంచిది కాదు: అభిమన్యు ఈశ్వరన్ తండ్రి ఫైర్‌!

  • బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ ఆగ్రహం
  • కరుణ్ నాయర్ కోసం తన కుమారుడికి అన్యాయం చేస్తున్నారని మండిపాటు
  • ఈశ్వరన్ అరంగేట్రం కోసం తాను రోజులు కాదు.. సంవత్సరాలు లెక్కిస్తున్నాన‌ని ఆవేద‌న‌
బీసీసీఐ సెలెక్టర్ల తీరుపై యువ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ మండిప‌డ్డారు. కరుణ్ నాయర్ కోసం తన కుమారుడికి అన్యాయం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐదు టెస్టుల‌ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వకుండా.. బెంచ్‌కే ప‌రిమితం చేయ‌డాన్ని ఆయ‌న‌ తప్పుబట్టారు. 

ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైన ఆఖరి టెస్ట్‌లోనూ ఈశ్వరన్‌కు నిరాశే ఎదురైంది. మరోసారి టీమిండియా మేనేజ్‌మెంట్ కరుణ్‌కు అవకాశం ఇచ్చింది. ఇలా త‌న కుమారుడిని మ‌రో ఆట‌గాడి కోసం బ‌లి చేశారంటూ రంగ‌నాథ‌న్ ఈశ్వ‌ర‌న్ బీసీసీఐపై ఫైర్ అయ్యారు. 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

"అభిమన్యు ఈశ్వరన్ అరంగేట్రం కోసం నేను రోజులు లెక్క పెట్టడం లేదు. ఏకంగా సంవత్సరాలనే లెక్కిస్తున్నాను. ఇప్పటికే మూడేళ్లు పూర్తయింది. ఒక ఆటగాడి బాధ్యత పరుగులు చేయడం. అభిమన్యు అది చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా-ఏ తరఫున రెండు మ్యాచ్‌ల్లో అభిమన్యు రాణించలేదని, అందుకే తుది జట్టులో అవకాశం దక్కలేదని కొందరు అన్నారు. 

కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు అభిమన్యు అద్భుతంగా ఆడిన సమయంలో కరుణ్ నాయర్ భారత జట్టులో లేడు. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ వంటి టోర్నీలను కూడా కరుణ్ నాయర్ ఆడలేదు. అతనికి అవకాశం కూడా దక్కలేదు. గతేడాది నుంచి ఇప్పటి వరకు అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌ దేశవాళీ క్రికెట్‌లో 864 ర‌న్స్‌ చేశాడు.

ఆటగాళ్లను ఎలా పోల్చుతారో నాకు అర్థం కావడం లేదు. కరుణ్ నాయర్‌కు అవకాశం ఇచ్చారు. మంచిదే.. అతను దేశవాళీ క్రికెట్‌లో 800కు పైగా ప‌రులుగు చేశాడు. సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచారు. అదే సమయంలో నా కొడుకు కాస్త నిరాశగా కనిపిస్తున్నాడు. అలా జరగడం సహజం. 

కొందరు ఆటగాళ్లను ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్టు జ‌ట్టులోకి తీసుకున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. టెస్ట్ ఫార్మాట్‌కు జట్టు ఎంపిక చేస్తున్నప్పుడు ఐపీఎల్ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకోకూడదు. టెస్టు జ‌ట్టు ఎంపికకు రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల ప్రదర్శనలే ప్రాతిపదిక కావాలి" అని రంగనాథన్ ఈశ్వరన్ అన్నారు.

కాగా, దేశవాళీ క్రికెట్‌‌లో అభిమన్యు ఈశ్వరన్ ఇప్ప‌టివ‌ర‌కు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 103 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 48.70 సగటుతో 7,841 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.


More Telugu News