K T Rama Rao: 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు మూడు నెలల సమయం ఉంది... సిద్ధంకండి: కేటీఆర్ పిలుపు

KTR Comments on Supreme Court Verdict on MLAs By Elections
  • సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్
  • తన తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందన్న కేటీఆర్
  • పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదన్న కేటీఆర్
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని ఆయన అన్నారు. పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు మూడు నెలల సమయం ఉందని, పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని ఆయన పేర్కొన్నారు. సీజేఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు తీర్పు నిరూపించిందని కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల సందర్భంగా పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తాను చెప్పే మాటలకి, నీతినియమాలకు కట్టుబడి ఉండాలని సూచించారు.

దమ్ముంటే, నిజాయతీ ఉంటే అనర్హత వేటు విషయంలో 'పాంచ్ న్యాయ్' పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అధికారాలను అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని ఇకపై అవహేళన చేయబోరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ మారిన పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన పది మంది ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా, కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన లక్షలాది మంది కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయని ఆయన పేర్కొన్నారు.
K T Rama Rao
KTR
BRS
Telangana Politics
Supreme Court Verdict
By Elections
Rahul Gandhi

More Telugu News