Asaduddin Owaisi: మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపై అసదుద్దీన్ రియాక్షన్ ఇదే!

Asaduddin Owaisi reacts to Malegaon blast case verdict
  • నిందితులంతా నిర్దోషులే అయితే.. ఆ ఆరుగురిని ఎవరు చంపినట్టు?..
  • కోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందన్న ఎంఐఎం ఎంపీ
  • ఈ తీర్పుపై ఫడ్నవీస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా అని ప్రశ్న
మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులంతా నిర్దోషులేనని కోర్టు తీర్పు వెలువరించడంపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నిందితులు అందరూ నిర్దోషులే అయితే ‘ఆ ఆరుగురిని ఎవరు చంపినట్టు?’ అని ప్రశ్నించారు. ఆధారాలు లేవంటూ నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నమాజ్ చేస్తున్న వారిని మతం పేరుతో టార్గెట్ చేసి దాడి చేశారని ఆయన ఆరోపించారు. బాంబు పేల్చి ఆరుగురిని బలి తీసుకున్నారని, పేలుడు ధాటికి వంద మందికి పైగా గాయపడ్డారని ఎంపీ గుర్తుచేశారు. మతం పేరుతో జరిగిన ఈ దారుణం కోర్టులో నిరూపణ కాలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అసంతృప్తిని కలిగించిందని వ్యాఖ్యానించారు.

ముంబై సబర్బన్ రైలు పేలుళ్ల తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గుర్తుచేశారు. ఆ కేసులోనూ ఆధారాలు స్పష్టంగా లేవనే కారణంతో నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందని చెప్పారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారన్నారు. ఆ కేసు తరహాలోనే మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపైనా ఫడ్నవీస్, మోదీ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాయా? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
Asaduddin Owaisi
Malegaon blast case
Malegaon blasts verdict
Mumbai suburban train blasts
Devendra Fadnavis
AIMIM
Indian courts
terrorism
crime news

More Telugu News