Prakasam Barrage: విజయవాడ ప్రకాశం బ్యారేజికి భారీగా వరద... అప్రమత్తమైన అధికారులు!

Prakasam Barrage Flood Alert in Vijayawada
  • పులిచింతల నుంచి 65 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
  • ప్రకాశం బ్యారేజీ వద్దకు భారీగా వరద నీటి ప్రవాహం
  • నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు
విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి 65 వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతోంది. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంత ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.

ప్రకాశం బ్యారేజీకి ఈరోజు (బుధవారం) మధ్యాహ్నానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలానే ఇసుక బస్తాలు, ఇతర రక్షణ చర్యలు చేపట్టేలా స్థానికంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణానదిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, నాటు పడవుల్లో ప్రయాణించడం వంటివి చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. 
Prakasam Barrage
Vijayawada
Krishna River
flood alert
Andhra Pradesh floods
Pulichintala project
G Lakshmisha
NDRF
SDRF
river flooding

More Telugu News