Bihar: శున‌కానికి రెసిడెన్సీ సర్టిఫికెట్‌.. రాజకీయంగా తీవ్ర దుమారం

Bihar Dog Babu residence certificate creates political uproar
  • పాట్నా జిల్లాలోని మాసౌర్హీ టౌన్ లో ఘ‌ట‌న‌
  • ‘డాగ్‌ బాబు’ పేరుతో డిజిటల్‌ రూపంలో రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ 
  • ప్రభుత్వ పోర్టల్‌లో అందుబాటులో కుక్క రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌
  • రాజకీయంగా దుమారం..కుక్క రెసిడెన్స్‌ పత్రాన్ని రద్దు చేసిన పాట్నా జిల్లా యంత్రాంగం
బీహార్‌లో అధికారులు ఓ శునకానికి రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీచేయటం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. పాట్నా జిల్లాకు చెందిన మాసౌర్హీ టౌన్‌ అధికారుల నుంచి ‘డాగ్‌ బాబు’ అనే పేరుతో డిజిటల్‌ రూపంలో రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ అయింది. సదరు కుక్క తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పేరు కుత్తియా దేవి, చిరునామా వివరాలతో ఉన్న రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ను ప్రభుత్వ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. 

ఫొటోలో ఉన్నది ఓ శున‌కం అన్న సంగతి చూసుకోకుండా ప్రభుత్వం దానికి ఓ రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీచేయటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ పాలనలో లోపభూయిష్టమైన వ్యవస్థకు ఇది నిదర్శమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీహార్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాలపై జరుగుతున్న భారీ వివాదం ఈ సర్టిఫికెట్‌ను మరింత చర్చనీయాంశంగా మార్చింది. 

ఓటరు జాబితా సవరణ అనేది ప్రజలకు ఓటు హక్కును నిరాకరించే కుట్ర అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 
ఇలాంటి సర్టిఫికెట్‌ను ఆమోదిస్తూ బీహార్‌ ఓటర్ల సర్వే(సర్‌)ను నిర్వహిస్తున్నారని, ఆధార్‌, రేషన్‌ కార్డులను లెక్కలోకి తీసుకోవటం లేదని ‘స్వరాజ్‌ ఇండియా’ సభ్యుడు యోగేంద్ర యాదవ్‌ ‘ఎక్స్‌’ (ట్విట్ట‌ర్‌)లో ఆరోపించారు. ఇలా కుక్కకు రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీచేయటం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. 

దాంతో పాట్నా జిల్లా యంత్రాంగం స్పందించింది. ఆ రెసిడెన్స్‌ పత్రాన్ని రద్దు చేసినట్లు ధ్రువీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. సంబంధిత అధికారుల‌పై కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. "దోషులైన ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంది" అని ప్రకటనలో పేర్కొంది. 
Bihar
Dog Babu
residence certificate
Patna
voter list
Swaraj India
Yogendra Yadav
corruption
political issue

More Telugu News