Vijay Deverakonda: మీరు దేవుడిచ్చిన వ‌రం: ఫ్యాన్స్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda Kingdom movie pre release event emotional speech
  • విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘కింగ్డ‌మ్’
  • ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • నిన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించిన‌ మేక‌ర్స్‌
  • ఈ ఈవెంట్ మొత్తం తన సినిమా కంటే ఎక్కువగా ఫ్యాన్స్‌ గురించే మాట్లాడిన విజ‌య్
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘కింగ్డ‌మ్’. భాగ్య‌శ్రీ బోర్సే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందించారు. ఈ నెల 31న మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మేక‌ర్స్‌ యూస‌ఫ్‌గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ మరోసారి తన అభిమానుల పట్ల తన గాఢమైన ప్రేమను వ్యక్తం చేశారు. 

ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ఆదరణను తానెప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ‘మీరు నాకు దేవుడిచ్చిన వరం’ అంటూ ఈ సందర్భంగా విజయ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మొత్తం తన సినిమా కంటే ఎక్కువగా  ఆయన అభిమానుల గురించే మాట్లాడారు.

“మరో రెండు రోజుల్లో జులై 31న మిమ్మల్ని థియేటర్లలో కలవబోతున్నాం. మనసులో కొంచెం భయం ఉంది, అదే సమయంలో ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది. ‘కింగ్డ‌మ్’ అవుట్ పుట్ పట్ల టీమ్ అందరం సంతోషంగా ఉన్నాం. ఈరోజు నేను అభిమానుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకుంటున్నా. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. ఈ రోజు ఫ్యాన్ మీట్ లో దాదాపు రెండు వేల మందిని కలిశాను. అందులో ఎక్కువమంది నాతో చెప్పిన మాట ‘అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం’. నన్ను మీ వాడిని చేసేసుకున్నారు. 

నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నాను. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరందరూ నా నుంచి కోరుకుంటున్న హిట్ ‘కింగ్డ‌మ్’తో రాబోతుంది. ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కాదు.. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’. ఈ కథ ఆలోచన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా పని మీదే ఉన్నాడు. ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ వేడుకకి రాలేకపోయాడు. 

ఆ తర్వాత ఇది అనిరుధ్ రవిచందర్ ‘కింగ్‌డమ్’. పాటలు ఇప్పటికే విన్నాం. నేపథ్యం సంగీతం కూడా అదిరిపోతుంది. నా సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అది ‘కింగ్డ‌మ్’తో నెరవేరింది. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. అలాగే ఇది నాగవంశీ ‘కింగ్డ‌మ్’. ఎంతో రిస్క్ చేసి ఈ సినిమా చేశారు. బెస్ట్ అవుట్ పుట్ రావడం కోసం.. ఎక్కడా రాజీ పడకుండా మేము ఏది అడిగితే అది ఇచ్చారు. భాగ్యశ్రీ బోర్సే కొత్తమ్మాయి. కానీ, సినిమా కోసం చాలా కష్టపడుతుంది. చాలా స్మార్ట్‌. రాబోయే రోజుల్లో పెద్ద స్థాయికి వెళుతుంది. 

నా సోదరులు సత్యదేవ్, వెంకటేశ్‌ ఇద్దరూ చాలా మంచి నటులు. ఈ సినిమాలో అన్న పాత్ర చాలా ముఖ్యమైంది. ఆ పాత్రలో సరైన నటుడు చేస్తేనే సినిమా పండుతుంది. అలాంటి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని చాలా చర్చించిన తర్వాత.. సత్యదేవ్‌ను గౌతమ్ ఎంపిక చేశాడు. షూటింగ్ సమయంలో సత్యదేవ్ నిజంగానే నాకు సోదరుడిలా అనిపించాడు. సత్యదేవ్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అలాగే వెంకటేశ్‌ అద్భుతంగా నటించాడు. ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని విజయ్ చెప్పుకొచ్చారు.

Vijay Deverakonda
Kingdom Movie
Gowtam Tinnanuri
Bhagya Shree Borse
Anirudh Ravichander
Telugu cinema
pre release event
Yusufguda Police Grounds
Satya Dev
Naga Vamsi

More Telugu News