Gaurav Gogoi: ఆపరేషన్ సిందూర్‌పై అనుమానాలు ఉన్నాయి: లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ

Gaurav Gogoi Questions Operation Sindoor in Lok Sabha
  • ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్
  • పాకిస్థాన్ కుట్రలను సాగనివ్వకూడదని వ్యాఖ్య
  • పహల్గామ్‌కు ఉగ్రవాదులు ఎలా రాగలిగారో రాజ్‌నాథ్ సింగ్ చెప్పలేదన్న కాంగ్రెస్ ఎంపీ
ఆపరేషన్ సిందూర్‌పై అనేక సందేహాలున్నాయని, వాటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ కుట్రలను సాగనివ్వకూడదని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనేక విషయాలు చెప్పారని, కానీ పహల్గామ్‌కు ఉగ్రవాదులు ఎలా రాగలిగారో మాత్రం చెప్పలేదని వ్యాఖ్యానించారు.

పహల్గామ్ వరకు ఉగ్రవాదులు వచ్చి ఎలా దాడి చేయగలిగిందో రాజ్‌నాథ్ చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతిపక్షంగా తాము కొన్ని ప్రశ్నలు వేస్తామని, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన కోరారు. భారతీయులంతా ఏకతాటిపై ఉండి పాకిస్థాన్ దురుద్దేశాలను సాగనివ్వకూడదని అన్నారు. ఉగ్రవాదులు పారిపోయేలా చేశారా లేదా అనే దానిపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉగ్రదాడిలో చనిపోయిన వ్యక్తి భార్య తన ఆవేదన వ్యక్తం చేస్తూ, తన భర్త మృతదేహంపై రాజకీయాలు జరగవద్దని కోరుకున్నారని గుర్తు చేశారు. మన సమాజం విభేదాలతో విచ్ఛిన్నం కావాలని పాకిస్థాన్ కోరుకుంటోందని, ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని రాహుల్ గాంధీ కూడా చెప్పారని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌కు తప్పకుండా బుద్ధి చెప్పాలని అన్నారు.

మారణకాండకు పాల్పడిన తర్వాత ఉగ్రవాదులు కొందరి సహకారంతో పరారయ్యారని గౌరవ్ గొగోయ్ అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వారి గురించి ప్రభుత్వం వద్ద సమాధానం లేదని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్ ప్రశాంతంగా మారిందని చెప్పినప్పటికీ, ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
Gaurav Gogoi
Operation Sindoor
Congress MP
Lok Sabha
Pahalgam Terrorist Attack

More Telugu News