Operation Mahadev: జమ్ము కశ్మీర్‌లో 'ఆపరేషన్ మహదేవ్'.. ఆ పేరు ఎందుకు పెట్టారంటే?

Operation Mahadev in Jammu Kashmir Kills 3 Terrorists
  • ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యం
  • ధృవీకరించిన ఆలిండియా రేడియో వెబ్‌సైట్
  • నెల రోజుల నుంచి ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపు
  • పకడ్బందీ ప్రణాళికతో ముగ్గురిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్ము కశ్మీర్‌లో సోమవారం జరిగిన 'ఆపరేషన్ మహదేవ్'లో పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ విషయాన్ని సైన్యం ధృవీకరించిందని ఆలిండియా రేడియో వెబ్‌సైట్ వెల్లడించింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వారి కోసం నెల రోజుల నుంచి భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.

ఈ ఆపరేషన్ కోసం గత కొన్ని రోజులుగా బలగాలు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయగా, దాచిగామ్ అడవుల్లో రెండు రోజుల క్రితం అనుమానాస్పద కమ్యూనికేషన్లను గుర్తించాయి. స్థానిక సంచార జాతులకు చెందిన వారు కూడా ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందించారని భద్రతా బలగాలు తెలిపాయి.

దీంతో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల బృందం ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించింది. స్థావరంలో ఐదు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో లిడ్వాస్ ప్రాంతంలో తొలిసారి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని 'చినార్ కోర్' (కశ్మీరీ వ్యాలీ మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించే) సామాజిక మాధ్యమ వేదికగా ధ్రువీకరించింది.

కాగా, దాచిగామ్ సమీపంలోని మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ మహదేవ్ అని పేరు పెట్టారు. ఈ ఎన్‌కౌంటర్ ప్రదేశం జబర్వన్-మహదేవ్ పర్వతాల మధ్య ఉంది. ఈ ఆపరేషన్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టాయి. ఆపరేషన్ కొనసాగుతోంది. మృతి చెందిన ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన విదేశీ ఉగ్రవాదులుగా సైన్యం గుర్తించింది.
Operation Mahadev
Jammu Kashmir
Indian Army
Pahalgam Terror Attack
Lashkar-e-Taiba

More Telugu News