వేగవంతమైన ట్రాన్స్ ఫర్మేషన్ కోసం సింగపూర్ తో కలసి పనిచేస్తాం: మంత్రి నారా లోకేశ్

  • సింగపూర్ లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తదితరుల పర్యటన 
  • నైపుణ్యాభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం 
  • కీలక ప్రసంగం చేసిన నారా లోకేశ్ 
వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి సాంకేతిక యుగంలో సంప్రదాయ విద్యా విధానం సరిపోదని, నాలుగో పారిశ్రామిక విప్లవం కేవలం సాంకేతిక నైపుణ్యాలను మాత్రమే కాకుండా, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాలను కూడా కోరుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సింగపూర్ లో 'నైపుణ్యాల నుంచి సామర్థ్యాలకు శ్రామికశక్తి పరివర్తనను వేగవంతం చేయడం' అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, డైనమిక్ వాతావరణంలో సవాళ్లను స్వీకరించే, నూతనన అంశాలను ఆవిష్కరించే, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం యువతకు అవసరమని ఉద్ఘాటించారు.

ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరణలకు కేంద్రంగా, శ్రామిక శక్తి పరివర్తనలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేశ్ తెలిపారు. యువతను కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలతో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ సాంకేతిక మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెడుతున్నామని, సంప్రదాయ విద్యా విధానానికి స్వస్తి పలకాలని, పాఠ్యప్రణాళికలో సమూల మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. పరిశోధన, ఆవిష్కరణలు, విద్యార్థి మార్పిడి కార్యక్రమాలు, వ్యవస్థాపకతపై సింగపూర్ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. 

సింగపూర్ నుంచి పాఠాలు: నిరంతర అభ్యాసం మరియు నైపుణ్య విశ్వవిద్యాలయాలు

నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం, శ్రామిక శక్తి అభివృద్ధి, ముఖ్యంగా జీవితకాల అభ్యాస రంగంలో సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉందని లోకేశ్ ప్రశంసించారు. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU), సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ (SUSS) వంటి సంస్థలు నిరంతర విద్య, నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలను ప్రారంభించాయని ఆయన గుర్తు చేశారు. NTUలో అసోసియేట్ ప్రొఫెసర్ సియా సీవ్ కీన్, SUSSలో డాక్టర్ యాప్ మీన్ షెంగ్ అభివృద్ధి చేసిన నమూనాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో జీవితకాల అభ్యాసంపై దృష్టి సారించే నైపుణ్య విశ్వవిద్యాలయాలను స్థాపించే ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. 

పరిశ్రమ-విద్యా సంస్థల సహకారం: నైపుణ్య అంతరాన్ని తగ్గించడం

సింగపూర్ విద్యా వ్యవస్థ బలాల్లో పరిశ్రమ-విద్యా రంగ సహకారం ముఖ్యమైందని లోకేశ్ పేర్కొన్నారు. సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ (SMU), సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (SUTD) వంటి సంస్థలు పరిశ్రమ అవసరాలను తమ పాఠ్యాంశాల్లో విజయవంతంగా చేర్చాయని, విద్యార్థులు విద్యాపరంగా నైపుణ్యం కలిగి ఉండటమే కాకుండా పరిశ్రమలకు సిద్ధంగా ఉండేలా తయారుచేస్తున్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు సంయుక్తంగా పాఠ్యాంశాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన ప్రాజెక్టులను రూపొందించేలా ఇండస్ట్రీ-విద్యారంగ కన్సార్టియం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. విద్యారంగం, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించే నమూనాలను అభివృద్ధి చేయడానికి SMU, SUTDలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని ఆయన వెల్లడించారు.

నైపుణ్యాభివృద్ధి మిషన్ మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలు

సింగపూర్‌లోని స్కిల్స్‌ఎస్‌జి వెంచర్స్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిందని లోకేశ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఉద్భవిస్తున్న సాంకేతికతలు వంటి రంగాలలో యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నైపుణ్యాభివృద్ధి మిషన్‌ను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తమ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి స్కిల్స్‌ఎస్‌జి వెంచర్స్‌ సహకారాన్ని కోరుతున్నామని లోకేశ్ ప్రకటించారు.

ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రిజిస్ట్రార్ ఆర్. రాజారామ్, నన్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సియా స్యూ, సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రదీప్ రెడ్డి, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ చైర్ ప్రొఫెసర్ రాజేష్ ఎలర మోహన్, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ యాప్ మీన్ షెంగ్, స్కిల్ ఎస్ఎస్ జి వెంచర్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్లు చెన్, హాంగ్ సియాంగ్ పాల్గొన్నారు.


More Telugu News