Chandrababu: గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి: సింగపూర్ మంత్రితో సీఎం చంద్రబాబు

CM Chandrababu Seeks Singapore Support for Green Energy Data Centers
  • సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చంద్రబాబు బృందం భేటీ  
  • విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ మంత్రికి ఆహ్వానం 
  • ఏపీలో హౌసింగ్, సబ్ సీ కేబుల్ రంగంలో పని చేసేందుకు సిద్ధమన్న సింగపూర్
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీ ప్రాజెక్టులను చేపట్టిందని ఇందులో సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సింగపూర్ లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం భేటీ అయింది. అలాగే గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. 

డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని.. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని సింగపూర్ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించటంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని సీఎం కోరారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చర్చించారు. 

గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా  రికార్డులు సరి చేసేందుకే సింగపూర్ వచ్చానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్ షిప్ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. సింగపూర్ ను చూసే గతంలో హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మరోవైపు ఏపీలో నవంబరు నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ను సీఎం చంద్ర‌బాబు ఆహ్వానించారు. 

గృహ నిర్మాణం, సబ్ సీ కేబుల్ రంగాల్లో కలిసి పని చేసేందుకు సింగపూర్ ఆసక్తి
ఏపీలో గృహ నిర్మాణం, సబ్ సీ కేబుల్ రంగంలో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ సీఎంకు తెలిపారు. ఈ రంగంలో సింగపూర్- ఏపీ కలిసి పని చేస్తామని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ, గృహనిర్మాణం లాంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకుతో కలిసి పని చేస్తున్నామని సింగపూర్ మంత్రి ఏపీ సీఎంకు వివరించారు. గతంలో హైదరాబాద్ వచ్చి సీఎం చంద్రబాబుతో కలిశానని సింగపూర్ మంత్రి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశానికి  మంత్రులు నారా లోకేశ్‌, నారాయణ, టీజీ భరత్ సహా ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Chandrababu
Andhra Pradesh
Singapore
Green Energy
Data Centers
Tan See Leng
Partnership Summit
Ports Logistics
Investments
AP Government

More Telugu News