Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిలో రైతు మృతి... పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan Reacts to Farmer Death in Elephant Attack in Chittoor
  • ఏనుగుల దాడిలో రైతు మృతి పట్ల పవన్ కల్యాణ్ విచారం
  • పరిహారం చెల్లించాలని అధికారులకు సూచన
  • తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్‌లో జనావాసాల్లో ఏనుగుల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏనుగులు సంచరించే మార్గాలపై పర్యవేక్షణ ఉంచాలని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడిలో మరో రైతు మరణించిన ఘటన తర్వాత, ఆయన ఈ సమస్యను తీవ్రంగా పరిగణించారు.
 
చిత్తూరు జిల్లాలోని కొత్తూరు గ్రామంలో రామకృష్ణ రాజు అనే రైతు పొలంలోకి వెళ్లినప్పుడు ఏనుగుల దాడిలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే అటవీశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. గత మూడు నెలలుగా సుమారు 15 ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో సంచరిస్తూ వ్యవసాయ భూములను ధ్వంసం చేస్తోందని అధికారులు వెల్లడించారు. అటవీశాఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఈ ఏనుగులు మానవ జీవితాలకు, పంటలకు ముప్పుగా మారాయని తెలిపారు. 2011 నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల్లో సుమారు 25 మంది మరణించినట్లు అటవీ అధికారులు వివరించారు.
 
 ఈ నేపథ్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏనుగుల గుంపులు సంచరించే మార్గాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, ఆయా ప్రాంతాల్లోని రైతులకు ముందస్తు సమాచారం అందించాలని ఆదేశించారు. మరణించిన రైతు కుటుంబానికి అటవీశాఖ, జిల్లా యంత్రాంగం తరపున సానుభూతిని తెలియజేసి, నష్టపరిహారం అందించాలని సూచించారు.
 
 గతంలో, పవన్ కళ్యాణ్ ఏనుగుల దాడులను నివారించడానికి ఏఐ ఆధారిత ట్రాకింగ్ మరియు అధునాతన హెచ్చరిక వ్యవస్థలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కర్ణాటకలో విజయవంతమైన ఏఐ ఆధారిత ఏనుగుల ట్రాకింగ్ కార్యక్రమాలను అధ్యయనం చేసి, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని సూచించారు. 

ఇప్పటికే కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి. ఈ ఏనుగులకు శిక్షణనిచ్చి, సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరింపజేయనున్నారు. అంతేకాకుండా, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఏనుగులు ఆకర్షించే అరటి, చెరకు వంటి పంటలకు బదులుగా తక్కువ ఆకర్షణీయమైన మినుములు, పప్పుధాన్యాలు వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సలహా ఇవ్వాలని ఆయన అన్నారు.
 

Pawan Kalyan
Chittoor district
Elephant attack
Farmer death
Andhra Pradesh
Forest department
AI tracking
Elephant monitoring
Compensation
Kunkis elephants

More Telugu News