India Pakistan Asia Cup: ఆసియాకప్‌లో భారత్-పాక్ పోరుపై మరోమారు రాజకీయ రగడ

India Pakistan Asia Cup match faces political heat
  • ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి ఆసియాకప్
  • 14న భారత్-పాక్ మధ్య మ్యాచ్
  • తీవ్రంగా ఖండిస్తున్న ప్రతిపక్షాలు 
  • క్రీడల్లోనూ పాక్‌ను బహిష్కరించాలని డిమాండ్లు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలో ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాక్ జట్లు తలపడనుండటం రాజకీయ దుమారం రేపుతోంది. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన నాలుగు నెలల తర్వాత ఈ మ్యాచ్ షెడ్యూల్ కావడంతో క్రీడల్లోనూ పాకిస్థాన్‌ను బహిష్కరించాలనే డిమాండ్లు మరోసారి బలంగా వినిపిస్తున్నాయి. విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  

ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ టోర్నీలోనూ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. పహల్గామ్ దాడిని ఉటంకిస్తూ హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధవన్ వంటి పలువురు భారతీయ రిటైర్డ్ ఆటగాళ్లు ఆ మ్యాచ్‌ నుండి వైదొలగడమే ఇందుకు కారణం.

కార్గిల్ విజయ్ దివస్ నాడు షెడ్యూల్ విడుదల
ఆసియా కప్ 2025 షెడ్యూల్ నిన్న అంటే.. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారతదేశం సాధించిన విజయాన్ని స్మరించే కార్గిల్ విజయ్ దివస్‌ నాడే విడుదలైంది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్థాన్‌తో ఎలా క్రికెట్ ఆడుతుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని "రక్తంతో సంపాదించే ధనం"గా వారు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడల ద్వారా దౌత్య సంబంధాలు నెరపడం సరైంది కాదని పేర్కొన్నారు.

శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది దీనిపై తీవ్రంగా స్పందించారు. ‘లాభం’ కంటే ‘సైనికుల రక్తం’ ఎంతో విలువైనదని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో ఏ దేశంలో ఆడినా భారతీయులందరూ వ్యతిరేకిస్తారని ఆమె స్పష్టం చేశారు. ఝార్ఖండ్ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ మాట్లాడుతూ ఆసియా కప్ షెడ్యూల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలు ముఖ్య పాత్ర పోషించవని ఆయన అన్నారు. "క్రీడలను రాజకీయాల నుంచి లేదా ఇతర విషయాల నుంచి వేరుగా ఉంచాలని చాలా మంది అంటారు, కానీ పాకిస్థాన్ చర్యల వల్ల దేశభక్తి, దేశమంతా జాతీయ భావనలు గాయపడ్డాయి. వారిపై గట్టి చర్యలు తీసుకున్న తర్వాతే మనం తదుపరి చర్యలు తీసుకోవాలి" అని పేర్కొన్నారు.

అంతర్జాతీయ ఈవెంట్లలోనూ ఆడకూడదు
1990లలో భారత జట్టుకు నాయకత్వం వహించిన మహమ్మద్ అజారుద్దీన్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ద్వైపాక్షిక ఈవెంట్‌లలో ఆడకపోతే, అంతర్జాతీయ ఈవెంట్‌లలో కూడా పాకిస్థాన్‌తో భారత్ ఆడకూడదని అన్నారు. "నా వైఖరి ఏమిటంటే, మీరు ద్వైపాక్షిక ఈవెంట్‌లలో ఆడకపోతే, అంతర్జాతీయ ఈవెంట్‌లలో కూడా ఆడకూడదు. కానీ ప్రభుత్వం, బోర్డు నిర్ణయించినది జరుగుతుంది" అని స్పష్టం చేశారు.

ఆసియా కప్ 2025లో ఎనిమిది దేశాలు పాల్గొంటాయి. సెప్టెంబర్ 9 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. గ్రూప్ దశలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. రెండు జట్లు సూపర్ ఫోర్ స్టేజ్‌కు చేరుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి, అప్పుడు మళ్లీ తలపడవచ్చు. ఒకవేళ రెండు జట్లు ఫైనల్స్‌కు చేరితే, టోర్నమెంట్‌లో ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది.
India Pakistan Asia Cup
Asia Cup 2025
India vs Pakistan
Priyanka Chaturvedi
Sukdev Bhagat
Mohammad Azharuddin
Kargil Vijay Diwas
Pahalgam Terrorist Attack
Cricket controversy

More Telugu News