హరిద్వార్ లో విషాదం.. ఆలయంలో తొక్కిసలాట ఆరుగురు భక్తులు మృతి

  • పలువురికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
  • ఆదివారం ఉదయం ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు
  • గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అధికారులు
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయని సమాచారం. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్ లో తోపులాట చోటుచేసుకుందని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి.

ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయిన విషయాన్ని గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధ్రువీకరించారు. విషయం తెలిసిన వెంటనే ఆలయం వద్దకు బయలుదేరానని, ఘటనా స్థలాన్ని పరిశీలించాక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.



More Telugu News