American Airlines: విమానం టేకాఫ్‌కు ముందు మంటలు, పొగ.. ప్రయాణికులు ఎలా తప్పించుకున్నారో చూడండి!

Denver Airport American Airlines Flight Fire Causes Emergency Evacuation
  • అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
  • మియామీకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ల్యాండింగ్ గేర్‌లో సమస్య
  • దట్టమైన పొగ, మంటలతో ప్రయాణికుల్లో భయాందోళనలు
  • విమానంలో 173 మంది ప్రయాణికులు
అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. మియామీకి బయలుదేరాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఏఏ-3023 టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా, ల్యాండింగ్ గేర్‌లో టైర్ లోపం వల్ల మంటలు చెలరేగి, రన్‌వేపై దట్టమైన పొగ వ్యాపించింది.  వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానం టేకాఫ్‌ను రద్దు చేశాడు. అందులోని 173 మంది ప్రయాణికులను అత్యవసరంగా, సురక్షితంగా ఖాళీ చేయించారు. ఈ ప్రక్రియలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

ఎఫ్ఏఏ దర్యాప్తు
మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం రన్‌వే నుంచి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ గేర్‌లోని టైర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగాయని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఈ ఘటనను ల్యాండింగ్ గేర్ సంబంధిత సమస్యగా నిర్ధారించి, మంటల ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని వెల్లడించింది.

భయంతో వణికిపోయిన ప్రయాణికులు
ఈ అత్యవసర ఖాళీ ప్రక్రియకు సంబంధించిన డ్రమాటిక్ ఫుటేజ్‌లో ప్రయాణికులు భయాందోళనలకు గురై విమానం నుంచి ఎమర్జెన్సీ స్లైడ్‌ల ద్వారా ఒక్కొక్కరుగా బయటకు రావడం కనిపించింది.. ల్యాండింగ్ గేర్‌లో మంటలు, దట్టమైన నల్లటి పొగ రన్‌వేను పూర్తిగా ఆవరించిన దృశ్యాలు కనిపించాయి.

డెన్వర్ విమానాశ్రయం ప్రకటనలో విమానం రన్‌వేపై ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందని, వెంటనే ఫస్ట్ రెస్పాండర్స్, డెన్వర్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. సాయంత్రం 5:10 గంటలకు మంటలు పూర్తిగా ఆర్పివేసినట్టు ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ప్రయాణికులను రన్‌వే నుంచి బస్సుల ద్వారా టెర్మినల్‌కు తరలించారు. ఐదుగురు వ్యక్తులను ఘటనా స్థలంలో పరీక్షించారు. స్వల్పంగా గాయపడిన ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.  

ప్రయాణికుడి నిర్లక్ష్యంపై విమర్శలు
విమానాన్ని ఖాళీ చేస్తున్న సమయంలో ఒక ప్రయాణీకుడు తన బిడ్డను ఒక చేతితో (మెడ వద్ద) పట్టుకుని, మరో చేత్తో లగేజీని తీసుకుంటూ స్లైడ్‌పై దిగుతూ కనిపించాడు. స్లైడ్ నుంచి దిగిన తర్వాత అతడు సమతుల్యం కోల్పోయి తన బిడ్డపై పడిపోయాడు. ఈ ప్రమాదకర పరిస్థితిలో బిడ్డ భద్రత కంటే లగేజీకి ప్రాధాన్యం ఇవ్వడంపై సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. "బిడ్డ భద్రత కంటే లగేజీ ముఖ్యమా?" అని కొందరు నెటిజన్లు తీవ్రంగా దుయ్యబట్టారు. 
American Airlines
Denver airport
flight AA-3023
plane fire
emergency evacuation
runway incident
Boeing 737 Max 8
Federal Aviation Administration
passenger safety
flight accident

More Telugu News