Govinda: షాకింగ్ ఘ‌ట‌న‌.. నాగుపామును కొరికి చంపిన ఏడాది బాలుడు!

1 year old bites cobra snake to death in Bihar village survives incident
  • బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఘ‌ట‌న 
  • నాగుపామును కొరికి చంపిన ఏడాది వయసున్న గోవింద అనే బాలుడు
  • కాసేప‌టికి స్పృహ కోల్పోయిన బాబును ఆసుప‌త్రికి తీసుకెళ్లిన‌ కుటుంబ స‌భ్యులు 
  • బాలుడు క్షేమంగా ఉన్నాడ‌ని, శ‌రీరంలో విషం లేద‌న్న‌ వైద్యులు
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గోవింద అనే ఏడాది వయసున్న బాలుడు నాగుపామును కొర‌క‌డంతో అది చ‌నిపోయింది. ఆ త‌ర్వాత కాసేప‌టికి చిన్నారి స్పృహ కోల్పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. బాలుడు క్షేమంగా ఉన్నాడ‌ని, శ‌రీరంలో విషం లేద‌ని వైద్యులు నిర్ధారించారు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బేతియా ప‌ట్ట‌ణ‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఒక మహిళ ఇంటి సమీపంలో కట్టెలు సేకరిస్తోంది. ఆమె ఏడాది కుమారుడు గోవింద ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో బాబు ద‌గ్గ‌రికి నాగుపాము వచ్చింది. ఆడుకుంటున్న బాలుడి చేతికి అది చుట్టుకుంది. 

దాంతో ఆ బుడతడు తన పళ్లతో గట్టిగా కొరకడంతో ఆ పాము చనిపోయింది. బాలుడి తల్లి, అమ్మమ్మ ఇది చూసి ఆందోళనకు గుర‌య్యారు. ఆ తర్వాత కాసేప‌టికే గోవింద స్పృహ కోల్పోయాడు. దాంతో మొద‌ట స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బేతియాలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుప‌త్రికి తరలించారు.

ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, బాబు శ‌రీరంలో విషం లేద‌ని వైద్యులు తెలిపారు. బాలుడు గోవిందకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఏడాది వయసున్న గోవింద నోటితో కొరికి నాగుపామును చంపిన ఈ సంఘటన స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆ బాలుడికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
Govinda
Bihar
snake bite
child bites snake
West Champaran
Betiah
snake dies
India news
viral video

More Telugu News