Ravikumar: రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన డిప్యూటీ కమిషనర్

Ravikumar Caught Taking Bribe GHMC Deputy Commissioner Arrested
  • హోటల్ యజమానిని రూ.5లక్షలు లంచం డిమాండ్ చేసిన రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్
  • రూ.2లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
  • డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన అధికారులు
ఒక హోటల్ యజమాని నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

తన సర్కిల్ పరిధిలోని ఒక హోటల్‌ను రవికుమార్ ఇటీవల తనిఖీ చేశారు. హోటల్ వంటగదిలో అపరిశుభ్రంగా ఉండటం, నిబంధనలు పాటించకపోవడంతో సీజ్ చేస్తానంటూ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ బెదిరించారు. హోటల్ సీజ్ చేయకుండా ఉండాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సదరు హోటల్ యజమాని ఏసీబీ అధికారులకు డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు.

ఏసీబీ అధికారుల సూచనల మేరకు నిన్న హోటల్ యజమాని రూ.2 లక్షలను సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌కు అందజేశారు. అదే సమయంలో అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా రవికుమార్‌ను పట్టుకున్నారు.

అయితే, ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే.. హోటల్ యజమానిని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ లంచం డిమాండ్ చేసిన సమయంలో, మీడియా వాళ్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.

మీడియాను అడ్డుపెట్టుకొని మరీ అధిక వసూళ్లకు పాల్పడినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. అయితే ఎవరైనా మీడియా ప్రతినిధులు నిజంగా ఇందులో పాత్ర వహించారా అనే దానిపైనా ఆరా తీస్తున్నామని డీఎస్పీ తెలిపారు. రవికుమార్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన అనంతరం అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. 
Ravikumar
GHMC
Rajendranagar
ACB
Anti Corruption Bureau
bribe
corruption
hotel
Hyderabad
media

More Telugu News