Chandrababu Naidu: అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో క్యూపీఐఏఐ భాగస్వామ్యం... చంద్రబాబు కీలక చర్చలు

Chandrababu Naidu Discusses QPIAI Partnership in Amaravati Quantum Valley
  • సీఎం చంద్రబాబుతో క్యూపిఐఏఐ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్ భేటీ 
  • అమరావతిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు
  • ముందుకువచ్చిన క్యూపీఐఏఐ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో క్యూపీఐఏఐ భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీలో క్యూపీఐఏఐ కూడా ఏపీ ప్రభుత్వంతో చేయి కలుపుతోంది. దీనిలో అధునాతన 8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు క్యూపీఐఏఐ సంస్థ ముందుకు వచ్చింది. 

ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్‌తో చర్చించారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, అలాగే, విద్యార్ధుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి క్యూపీఐఏఐను కోరారు. తద్వారా విద్యార్ధులు, పరిశోధకులు, స్టార్టప్‌లు క్వాంటం అల్గారిథంలు, అప్లికేషన్‌లను రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

వివిధ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ సేవలు

రాష్ట్రంలో వివిధ పంటల సాగులో కచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరిస్తుందని భావిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలా సూచనలు, సలహాలను సకాలంలో ఇవ్వటం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపడేందుకు ఈ సాంకేతికత దోహద పడాలని సీఎం పేర్కోన్నారు. రాష్ట్రంలో నీటి వనరులను సమర్ధంగా నిర్వహించేందుకు వీలుగా క్వాంటం టెక్నాలజీని వాడాలన్నారు. 

వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ తదితర అంశాల్లోనూ క్వాంటం సిమ్యులేషన్‌ను సమర్ధంగా వినియోగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంలోనూ క్వాంటం టెక్నాలజీ సహకారాన్ని తీసుకునేలా ప్రభుత్వం యోచన చేస్తోంది. 

క్వాంటం లాంటి ఆధునిక సాంకేతికత ద్వారా సామాన్య ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్ని మెరుగుపరిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించటమే లక్ష్యంగా క్యూపీఐఏఐ, నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Amaravati Quantum Valley
QPIAI partnership
Andhra Pradesh
National Quantum Mission
Quantum computing
Narendra Nagarajan
AP government
Quantum technology
Center of Excellence

More Telugu News