ధన్‌ఖడ్‌కు వీడ్కోలు పలుకుదామన్న కాంగ్రెస్ డిమాండ్‌పై కేంద్రం మౌనం!

  • ధన్‌ఖడ్‌కు వీడ్కోలు నిర్వహించాలని బీఏసీలో జైరాం రమేశ్ డిమాండ్
  • జైరాం రమేశ్ డిమాండ్‌కు ఇతర ప్రతిపక్ష నేతల నుండి లభించని మద్దతు
  • కేంద్ర మంత్రులు ఈ అంశంపై మాట్లాడలేదని అధికార వర్గాల వెల్లడి
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని కాంగ్రెస్ పార్టీ కోరగా, కేంద్రం స్పందించలేదని సమాచారం. గురువారం రాజ్యసభలో ఏడుగురు సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ధన్‌ఖడ్‌కు కూడా వీడ్కోలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై కేంద్రం స్పందించలేదు.

కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా కూడా ఈ అంశంపై ఏమీ మాట్లాడలేదని అధికార వర్గాలు తెలిపాయి. అదే సమయంలో జైరాం రమేశ్ డిమాండ్‌కు మిగిలిన ప్రతిపక్ష నేతల నుండి కూడా మద్దతు లభించలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో జైరాం రమేశ్ డిమాండ్‌పై కేంద్రం స్పందించకపోవడం గమనార్హం.

ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖడ్‌ సోమవారం ప్రకటించారు. ఆయన హఠాత్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ధన్‌ఖడ్ రాజీనామా వెనుక ఏదో పెద్ద కారణమే ఉందని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదించారు.


More Telugu News