గుజరాత్‌లో నలుగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

  • నకిలీ నోట్ల రాకెట్ నడుపుతూ ఆల్‌ఖైదా భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్న నిందితులు
  • ‘ఆల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) తో సంబంధాలు 
  • ‘ఆపరేషన్ సిందూర్‌’పై వ్యతిరేక సాహిత్యం స్వాధీనం
గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఒక ఆపరేషన్‌లో ‘ ఆల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) తో సంబంధాలున్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. నకిలీ నోట్ల రాకెట్ నడుపుతూ, ఆల్‌ఖైదా భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్న మొహద్ ఫైక్, మొహద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషి, జీషన్ అలీని అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరిని గుజరాత్ బయట మరో రాష్ట్రంలో అరెస్టు చేసినట్టు సమాచారం.

ఆటో-డిలీట్ యాప్‌లతో రహస్య కమ్యూనికేషన్
ఈ ఉగ్రవాదులు తమ కమ్యూనికేషన్‌ను రహస్యంగా ఉంచేందుకు ఆటో డిలీట్ యాప్‌లను ఉపయోగించారని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ యాప్‌లు వారి సందేశాలను ఎటువంటి ఆధారాలు లేకుండా తొలగించేలా రూపొందించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా అల్‌ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, యువతను జిహాదీ కార్యకలాపాల వైపు ఆకర్షించేందుకు వీరు ప్రయత్నించారు.  

పాకిస్థాన్ కనెక్షన్.. ఏక్యూఐఎస్ సాహిత్యం స్వాధీనం
ఢిల్లీకి చెందిన మొహద్ ఫైక్ పాకిస్థాన్‌కు చెందిన ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌తో సంప్రదింపులు జరిపి, భారత్‌లో జిహాదీ కార్యకలాపాలను విస్తరించేందుకు కుట్ర పన్నినట్టు ఏటీఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని ఫతేవాడి ప్రాంతంలో షేక్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసినప్పుడు, ఏక్యూఐఎస్ సాహిత్యం, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సాహిత్యం మే నెలలో పాకిస్థాన్‌పై జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’కు వ్యతిరేకంగా జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన నలుగురినీ విచారిస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. వీరి సోషల్ మీడియా హ్యాండిల్స్, చాట్‌లను విశ్లేషిస్తూ వారి కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఉన్నారు.  


More Telugu News