N Sanjay: సంజయ్ ముందస్తు బెయిల్ తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

N Sanjay Supreme Court Surprised by Anticipatory Bail Order
  • ముందస్తు బెయిల్ పై విచారణను మినీ ట్రయిల్‌లా నిర్వహించినట్లుందన్న సుప్రీం ధర్మాసనం
  • 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పా అంటూ ఆశ్చర్యం
  • తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు 49 పేజీలతో ఆయనకు ముందస్తు బెయిల్ తీర్పు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

సంజయ్ ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో ఏపీ హైకోర్టు విచారణను మినీ ట్రైయిల్‌లా నిర్వహించినట్లుందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు, సంజయ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ఒప్పంద పత్రం, ఇన్వాయిస్‌లను సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

ఒప్పంద పత్రాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఎన్. సంజయ్ పనిచేసిన సమయంలో ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఆ క్రమంలో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. 
N Sanjay
IPS Officer N Sanjay
Andhra Pradesh CID
Supreme Court
Anticipatory Bail
AP High Court
YS Jagan Government
Corruption Allegations
Fire Services Department
Justice Amanullah

More Telugu News