పంత్‌కు తీవ్ర గాయం.. నొప్పితో విలవిల్లాడిపోయిన యువ బ్యాట‌ర్.. ఇదిగో వీడియో!

  • మాంచెస్టర్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లండ్ నాలుగో టెస్టు
  • మొద‌టి రోజు బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా గాయ‌ప‌డ్డ పంత్‌
  • వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడ‌బోయిన పంత్ కుడి కాలు పాదానికి గాయం
  • ఫిజియో వ‌చ్చి చికిత్స చేస్తుండ‌గా నొప్పితో విలవిల్లాడిన పంత్
  • రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన వైనం

బుధవారం మాంచెస్టర్‌లో ప్రారంభమైన భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. చివరి సెషన్‌లో క్రిస్ వోక్స్ వేసిన బంతిని పంత్‌ రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ ఎడ్జ్‌కు త‌గిలి పంత్ కుడి కాలు పాదానికి బ‌లంగా తాకింది. షూ తీసి చూడ‌గా పాదం న‌లిగిపోయింది. పాదం నుంచి రక్తం కారడం కనిపించింది. 

ఫిజియో వ‌చ్చి చికిత్స చేస్తుండ‌గా పంత్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో పంత్ రిటైర్డ్ హార్ట్‌గా మైదానం వీడాడు. తన కాలును నేలపై పెట్టడానికి ఇబ్బంది పడ్డాడు. అత‌న్ని మొబైల్ అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. పంత్‌ను స్కానింగ్ కోసం ఆసుప‌త్రికి తీసుకెళ్లిన‌ట్టు సాయి సుద‌ర్శ‌న్ తెలిపాడు. గాయ‌మైన‌ సమయంలో పంత్ 48 బంతుల్లో 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 

గాయం తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుండ‌డంతో అత‌డు మిగతా మ్యాచ్‌లు ఆడ‌డంపై అనుమానాలు నెల‌కొన్నాయి. ఒక‌వేళ పంత్ జ‌ట్టుకు దూర‌మైతే భార‌త్‌కు భారీ ఎదురుదెబ్బే. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో కీపింగ్ చేస్తున్నప్పుడు పంత్ వేలికి గాయమైన విష‌యం తెలిసిందే. దాంతో అత‌డు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేయ‌లేక‌పోయాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు.

సిరీస్‌లో అద్భుతంగా ఆడుతున్న పంత్‌
ఈ సిరీస్‌లో పంత్ ఇప్పటివరకు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 70.83 సగటుతో 425 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు బాదాడు. జ‌ట్టు త‌ర‌ఫున‌ అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. అతని రెండు సెంచరీలు లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో వచ్చాయి. త‌ద్వారా భారత్ నుంచి అలా ఒకే టెస్టులో రెండు శ‌త‌కాలు బాదిన‌ మొదటి కీపర్-బ్యాటర్‌గా అవ‌త‌రించాడు.


More Telugu News