Satwik Murari: నాడు సాయం పొందాడు... నేడు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు... చంద్రబాబు ప్రశంసలు!

Chandrababu Praises Satwik Murari for Helping Needy Students After Receiving Government Aid
  • 2016 సంవత్సరంలో విదేశీ విద్యా పథకం కింద ఐర్లాండ్ లో చదువుకున్న సాత్విక్
  • ఇప్పుడు ఐర్లాండ్ లో వ్యాపారం
  • నలుగురు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు చంద్రబాబును కలిసిన సాత్విక్
ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పేదల అభ్యున్నతికి ఉపయోగపడాలి... అప్పుడే ఆ పథకాలకు సార్థకత చేకూరుతుంది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఇప్పుడు ఆ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నాడు ఆర్థిక సాయం పొందిన చేతులు.. ఇప్పుడు పేదలకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి.

మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును యువ వ్యాపారవేత్త సాత్విక్ మురారి కలిశారు. 2016 సంవత్సరంలో విదేశీ విద్యా పథకం కింద ఐర్లాండ్ లో చదువుకోవడానికి నాటి టీడీపీ ప్రభుత్వం సహకరించిందని ముఖ్యమంత్రికి సాత్విక్ వివరించారు. ప్రభుత్వం అందించిన సాయంతో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో ఐర్లాండులో ఎంఎస్ విద్యను అభ్యసించానని చెప్పారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేసిన తాను.. ఇప్పుడు ఐర్లాండ్ లో వ్యాపారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. 

నాడు ప్రభుత్వం నుంచి సాయం పొందిన తాను... ఇప్పుడు విదేశాల్లో చదవాలని ఆసక్తి చూపించే పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దశంతో ఉన్నట్టు సాత్విక్ చెప్పారు. ఈ మేరకు మెరిట్ కలిగిన పేద విద్యార్థులను ఎంపిక చేసి విదేశాల్లో వారికి చేయూతనిచ్చేలా స్కాలర్ షిప్ పేరుతో ఆర్థిక సాయం అందివ్వనున్నట్టు చెప్పారు. ఈ మేరకు తాము నలుగురు పేదలకు విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్ షిప్ అందించేందుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా సాత్విక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. తిరిగి సమాజానికి కొంత ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిన యువకుడిని ప్రశంసించారు. సీఎంను కలిసిన వారిలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ ఉన్నారు.
Satwik Murari
Chandrababu Naidu
TDP Government
Foreign Education
Scholarships
Ireland Education
Business Management
Student Aid
Andhra Pradesh
Welfare Schemes

More Telugu News