ఐర్లాండ్ లో జాత్యహంకార దాడి... భారతీయుడికి తీవ్ర గాయాలు!

  • ఐర్లాండ్ లో తల్లాఘట్ లో దాడి ఘటన
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • మూడు వారాల కిందటే ఐర్లాండ్ వచ్చిన బాధితుడు
డబ్లిన్‌లోని తల్లాఘట్‌లో శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఒక దారుణ ఘటనలో, 40 ఏళ్ల భారతీయ పౌరుడిపై దుండగుల బృందం దాడి చేసింది. అతడి బట్టలు విప్పించి, అతడిపై దాడి చేశారు. పార్క్‌హిల్ రోడ్‌లో జరిగిన ఈ దాడిలో బాధితుడు ముఖం, చేతులు, కాళ్ళపై తీవ్ర గాయాలతో తల్లాఘట్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జాతి వివక్షకు సంబంధించిన తీవ్ర చర్చను రేకెత్తించింది. ఐర్లాండ్ పోలీసులు ఈ ఘటనను జాత్యహంకార నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు సమాచారం.  ఈ ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు కూడా స్పష్టం చేశారు. ఈ దాడిపై దర్యాప్తు కొనసాగుతోంది.ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధితుడికి జరిగిన గాయాల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుడికి మద్దతుగా నిలిచిన ఐరిష్ ప్రజలకు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

తల్లాఘట్ సౌత్ కౌన్సిలర్ బేబీ పెరెప్పాడన్ బాధితుడిని పరామర్శించారు. ఆ భారతీయుడు మూడు వారాల క్రితమే ఐర్లాండ్‌కు వచ్చాడని, ఈ ఘటనతో తీవ్ర షాక్‌లో ఉన్నాడని తెలిపారు. తల్లాఘట్‌లో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ఈ ప్రాంతంలో పోలీసుల గస్తీ పెంచాలని కోరారు. భారతీయులు ఐర్లాండ్‌లో ఆరోగ్య సంరక్షణ, ఐటీ రంగాలలో కీలక నైపుణ్యాలను అందిస్తున్నారని, వారిని సమాజం గౌరవించాలని పేర్కొన్నారు. 

మరో నేత మాట్లాడుతూ, ఈ దాడిని 'హింసాత్మక, జాతి వివక్షతో కూడిన చర్య'గా అభివర్ణించారు. ఇటువంటి హింస సమాజాన్ని సురక్షితంగా చేస్తుందని భావించేవారు అబద్ధం చెబుతున్ననట్టేనని ఆయన అన్నారు. న్యాయ శాఖ మంత్రి జిమ్ ఓ'కల్లగన్ ఈ వారం విదేశీ పౌరులపై తప్పుడు నేరారోపణలు పెరిగాయని పేర్కొన్నారు. వలసదారులు నేరాలకు పాల్పడే అవకాశం తక్కువగా ఉందని గణాంకాలు చూపుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News