హాకీ క్రీడాకారిణిపై అత్యాచారం... నలుగురు కోచ్ ల అరెస్ట్

  • ఒడిశాలో ఘటన
  • సాయ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న హాకీ క్రీడాకారిణి
  • లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన కోచ్ లు
ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో 15 ఏళ్ల టీనేజ్ హాకీ క్రీడాకారిణిపై కోచ్ లే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నివ్వెరపరుస్తోంది. ఈ కేసులో నలుగురు హాకీ కోచ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణం రూర్కెలాలోని సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సెంటర్‌లో చోటుచేసుకుంది.

బాధితురాలు గత రెండేళ్లుగా ఈ కేంద్రంలో శిక్షణ పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూలై 3వ తేదీ సాయంత్రం స్థానిక స్టేడియంలో కోచింగ్ సెషన్ ముగిసిన తర్వాత నలుగురు కోచ్ లు, ఆ క్రీడాకారిణిని ఒక లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ వారు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

జూలై 21 రాత్రి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని నలుగురు శిక్షకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్లతో పాటు సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కేసులు నమోదు చేశారు. సోమవారం కోర్టులో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సంఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది



More Telugu News