Election Commission of India: ఎస్ఐఆర్‌పై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం

Election Commission of India clarifies on SIR
  • ఎస్ఐఆర్ నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించడం కోసమేనన్న ఈసీ
  • సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఈసీ
  • ఎస్ఐఆర్‌ను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చిత్రీకరిస్తున్నాయన్న ఈసీ
నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం చేపట్టామని, దీనివల్ల ఓటర్లకు ఎలాంటి నష్టం ఉండదని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఈసీ కౌంటర్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నిన్న ఈసీ కౌంటర్ దాఖలు చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షాలకు లబ్ధి చేకూరే విధంగా బీహార్ ఓటర్ల జాబితాలో మార్పులు చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఈసీ మరోమారు తోసిపుచ్చింది. ఈసీ తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తిస్తోందని తెలిపింది. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఎస్ఐఆర్‍ను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని సుప్రీంకోర్టు దృష్టికి ఈసీ తీసుకొచ్చింది.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఎస్ఐఆర్‍ను నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

అయితే, ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డును పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈసీని అనుమానించడానికి ఏమీ లేదని, ఈ అంశంపై మరింత విచారణ జరగాల్సి ఉన్నందున విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. 
Election Commission of India
ECI
Supreme Court
Voter List
Special Summary Revision
Bihar Voter List
Fake Voters
Aadhar Card
Election ID
Voter ID

More Telugu News