Revanth Reddy: రేవంత్ 46 సార్లు ఢిల్లీకి వస్తే ప్రధానిని కలిశారు కానీ, రాహుల్ అపాయింట్‌మెంట్ దక్కలేదు: తెలంగాణ బీజేపీ చీఫ్

Revanth Reddy Visited Delhi 46 Times Met PM But Not Rahul Gandhi Telangana BJP Chief
  • ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఎప్పుడు సమయం కోరినా ఇచ్చారన్న ఎన్ రామచందర్ రావు
  • సొంత పార్టీ సీఎంకు రాహుల్ గాంధీ ఎందుకు సమయం ఇవ్వడం లేదని నిలదీత
  • బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న తెలంగాణ బీజేపీ అధినేత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 46 సార్లు ఢిల్లీకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ లభించలేదని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను మాత్రం కలిశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు ఆయన ఎప్పుడు కోరినా సమయం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ సొంత పార్టీ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ ఎందుకు సమయం ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడం కేంద్రం బాధ్యత అని చెబుతున్నారని, లీగల్ ఒపీనియన్ లేకుండా ఆర్డినెన్స్ ఎలా తీసుకువచ్చారని నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని అన్నారు. అసాధ్యమని తెలిసినప్పటికీ బిల్లు తీసుకురావడం సరికాదని అన్నారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బిల్లు తీసుకువచ్చారని ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై నిందలు వేస్తే సహించేది లేదని అన్నారు. ముస్లింలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ తొలగించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే సుప్రీంకోర్టు కూడా అనుమతించదని రామచందర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఎలా నడపాలనే విషయమై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు తాను ఢిల్లీ వచ్చానని ఆయన వెల్లడించారు.
Revanth Reddy
Telangana
BJP
N Ramachander Rao
Rahul Gandhi
Narendra Modi
Delhi

More Telugu News