హైకోర్టు జడ్జిని ‘వర్మ’ అంటున్నారు ఆయన మీ స్నేహితుడా?.. లాయర్ పై సీజేఐ సీరియస్

  • ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తిని ఏకవచనంలో సంబోధించడంపై ఆగ్రహం
  • ఆయన ఇప్పటికీ జడ్జిగానే ఉన్నారని గుర్తుచేసిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
  • అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన జడ్జి స్థానానికి అనర్హుడన్న లాయర్
  • న్యాయ సూత్రాల గురించి ధర్మాసనానికి చెప్పొద్దంటూ సీజేఐ హెచ్చరిక
ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంతో అభిశంసన ముప్పు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని దరఖాస్తుదారుడి తరఫు న్యాయవాది చేసిన వినతిని తోసిపుచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ యశ్వంత్ వర్మను ‘వర్మ’ అంటూ సంబోధించిన లాయర్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘జస్టిస్ యశ్వంత్ వర్మను, వర్మ అని సంబోధిస్తున్నారు.. ఆయన మీ స్నేహితుడా’ అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. జస్టిస్ వర్మ ఇప్పటికీ న్యాయమూర్తేనని గుర్తుచేశారు. ఓ హైకోర్టు న్యాయమూర్తిని ఎలా సంబోధించాలో తెలియదా అంటూ సీరియస్ అయ్యారు. దీంతో న్యాయవాది మాథ్యూస్ నెడుంపర స్పందిస్తూ.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఈ ఆరోపణల కారణంగా న్యాయమూర్తి స్థానానికి ఆయన సరితూగరని అన్నారు. ఈ వివరణతో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మరింత సీరియస్ గా స్పందించారు. తమకు న్యాయ సూత్రాలు బోధించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.


More Telugu News