Anitha: ఆధారాలు చూపించాం కాబట్టే కోర్ట్ రిమాండ్ కు పంపింది: అనిత

AP Home Minister Anitha Comments on Mithun Reddy Arrest
  • ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోం మంత్రి వివరణ
  • రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
  • ప్రతీ పోలీస్ స్టేషన్ కు రెండు డ్రోన్లు అందిస్తామని వెల్లడి
మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాల్లేకుండా పోలీసులు ఎవరినీ అరెస్టు చేయరని, ఆధారాలు ఉంటే ఎవరినీ వదిలిపెట్టరని స్పష్టం చేశారు. న్యాయస్థానానికి తగిన ఆధారాలు చూపించాం కాబట్టే మిథున్ రెడ్డిని కోర్టు రిమాండ్ కు పంపించిందని చెప్పారు. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని వ్యాఖ్యానించారు.

మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి తోసిపుచ్చారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. ఈ కేసులో ప్రొసీజర్ మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూడు సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్లు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు త్వరలో ప్రతీ జిల్లాకు ఓ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. అదేవిధంగా.. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం, ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతీ పోలీసుస్టేషన్‌ కు రెండు డ్రోన్లు అందిస్తామని హోంమంత్రి అనిత వివరించారు.
Anitha
AP Home Minister
Mithun Reddy
Liquor Scam Case
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Police
Cyber Crime Police Station
CC Cameras
Chandrababu Naidu
Srisatya Sai District

More Telugu News