YV Subba Reddy: వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది: వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy Slams AP Government Over Arrests and Liquor Allegations
  • లేని లిక్కర్ కేసు బనాయించి వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్న సుబ్బారెడ్డి
  • పార్లమెంటు సమావేశాల వేళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపాటు
  • జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వ విఫలమయిందని విమర్శ
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. లేని లిక్కర్ కేసును బనాయించి వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ... తమ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని... ఇది చాలా దారుణమని సుబ్బారెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో ఎక్సైజ్ పాలసీపై చర్చకు తాము సిద్ధమని... అదేవిధంగా 2014-19 మధ్య ఎక్సైజ్ పాలసీపై కూడా చర్చించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు వ్యాపారులకు మద్యం లైసెన్సులు ఇచ్చి, ఊరూరా బెల్టు షాపులు పెట్టించారని దుయ్యబట్టారు. 

వైసీపీ హయాంలో ప్రభుత్వమే పారదర్శకంగా మద్యం దుకాణాలను నిర్వహించిందని సుబ్బారెడ్డి తెలిపారు. మద్యం అమ్మకాలను తగ్గించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని చెప్పారు. తమ అధినేత జగన్ కు సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు. అప్పుల కోసం రాష్ట్రంలోని ఖనిజ సంపదను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఈ అంశాలన్నింటినీ పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పారు. 

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కు కేంద్ర ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పిందని... ఈ విషయంలో కేంద్రానికి వైసీపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని తెలిపారు. 
YV Subba Reddy
YSRCP
Andhra Pradesh
Liquor case
Mithun Reddy arrest
Excise policy
Jagan security
Operation Sindoor
AP government
Parliament

More Telugu News