Udith Pradhan: భువనేశ్వర్ అత్యాచారం కేసులో కాంగ్రెస్ విద్యార్థి నేత అరెస్ట్

Bhubaneswar Rape Case Udith Pradhan Arrested
  • ఈ ఏడాది మార్చిలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగికదాడి
  • కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అఘాయిత్యానికి పాల్పడినట్టు విద్యార్థి నేతపై ఆరోపణలు
  • బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక
  • నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు చేసిన బాధితురాలు
19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో కాంగ్రెస్ పార్టీ ఒడిశా యూనిట్ విద్యార్థి నాయకుడు ఉదిత్ ప్రధాన్‌ను భువనేశ్వర్‌లోని మంచేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం మార్చి 18న ఈ ఘటన జరగ్గా, జులై 20న రాత్రి 8.30 గంటలకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు తన ఇద్దరు స్నేహితులతో కలిసి మాస్టర్ క్యాంటీన్ చౌక్‌లో ఉన్నప్పుడు ఉదిత్ ప్రధాన్‌ను కలిసింది. ఒక స్నేహితుడు ఆమెను ఉదిత్‌కు పరిచయం చేశాడు. అతడు తనను తాను నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ఒడిశా అధ్యక్షుడిగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత వారు ఉదిత్ వాహనంలో నయాపల్లిలోని ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడ వారు మద్యం తాగారు. బాధితురాలు మద్యం తాగేందుకు నిరాకరించింది.

 దీంతో  ఉదిత్ ఆమెకు కూల్‌డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన కాసేపటికి బాధితురాలికి మైకం కమ్మినట్టు అనిపించడంతో ఇంటికి తీసుకెళ్లమని కోరింది. అయితే, ఉదిత్, అతడి స్నేహితులు ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చాక తనపై లైంగికదాడి జరిగినట్టు గుర్తించింది. దీంతో ఉదిత్‌ను ఆమె ప్రశ్నించగా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

బాధితురాలు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో గత రాత్రి ఉదిత్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఇటీవల గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్ బీచ్‌లో ఒక కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, బాలాసోర్‌లో ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య, పూరీలోని బలంగా ప్రాంతంలో 15 ఏళ్ల బాలికను చంపే ప్రయత్నం వంటి ఘటనలు ఒడిశాలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Udith Pradhan
Bhubaneswar rape case
Odisha Congress
NSUI Odisha
student leader arrest
sexual assault
crime news Odisha
Mancheswar police
Gopalpur beach
women safety Odisha

More Telugu News