Delta Airlines: ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం.. సమీపంలోకి యుద్ధ విమానం.. ప్యాసింజర్ ఫ్లైట్!

Delta Airlines Passenger Plane Narrowly Avoids Collision With War Plane
  • పారిస్ నుంచి సిన్సినాటి బయలుదేరిన డెల్టా విమానం
  • 1.7 నాటికల్ మైళ్ల సమీపానికి బీ-52 బాంబర్‌ 
  • వెంటనే అప్రమత్తమైన పైలట్
  • విమానాన్ని 500 అడుగుల కిందికి దించడంతో తప్పిన ప్రమాదం
ఆకాశంలో పెను ప్రమాదం తప్పింది. ఒక ప్రయాణికుల విమానం.. యుద్ధ విమానాన్ని ఢీకొట్టే ఘటన త్రుటిలో తప్పింది. గత వారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పారిస్ నుంచి సిన్సినాటి /నార్తర్న్ కెంటకీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానానికి అమెరికాకు చెందిన యుద్ధ విమానం బీ-52 బాంబర్‌ అతి సమీపానికి వచ్చింది. అప్రమత్తమైన డెల్టా విమాన పైలట్ ఫ్లైట్‌ను వెంటనే కొన్ని అడుగుల కిందికి దించడంతో ప్రమాదం తప్పింది.
 
యుద్ధ విమానం సమీపంలోకి వచ్చిన విషయాన్ని ‘ఎవరూ మాకు చెప్పలేదు’ అని పైలట్ చెప్పడం గమనార్హం. రాడార్ కంట్రోల్‌లో కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఇది జరిగినట్టు తెలుస్తోంది. ఈ నెల 10న ఒక బీ-52 హెచ్ స్ట్రాటోఫోర్ర్టస్ బాంబర్ సమీపంలోకి వచ్చి డెల్టా విమానాన్ని ఢీకొన్నంత పనిచేసింది. అప్పుడు డెల్టా విమానం 30 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. బీ-52 విమానం సమీపంలో ఉందని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమై అగ్రెసివ్ మాన్యువర్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) డేటా ప్రకారం.. రెండు విమానాల మధ్య దూరం 1.7 నాటికల్ మైళ్ల కంటే తక్కువగా ఉంది. ఇది రాడార్ కంట్రోల్ స్టాండర్డ్ సెపరేషన్ దూరం కంటే చాలా తక్కువ. డెల్టా పైలట్, ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఏఎస్) హెచ్చరికను అనుసరించి విమానాన్ని 500 అడుగులు దిగువకు తీసుకెళ్లి, ఢీకొనే ప్రమాదాన్ని నివారించాడు.

"మాకు ఎవరూ చెప్పలేదు, మేము రాడార్ పర్యవేక్షణలో ఉన్నామని అనుకున్నాం" అని డెల్టా పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో జరిపిన సంభాషణలో చెప్పాడు. ఏవియేషన్ ఔత్సాహికులు షేర్ చేసిన వీడియోలో ఈ ఆడియో రికార్డ్ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఈ ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ) దర్యాప్తు చేస్తున్నాయి. తమ పైలట్లు ప్రామాణిక ప్రొసీజర్‌ను అనుసరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని డెల్టా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.
Delta Airlines
Passenger Plane
War Plane
B-52 Bomber
Near Miss
Aviation Accident
FAA Investigation
Air Traffic Control
Cincinnati Airport
NTSB

More Telugu News