UPI Payments: యూపీఐ లావాదేవీల్లో భార‌త్ టాప్: ఐఎంఎఫ్‌

IMF Says India Leads World in UPI Transactions
  • నేడు మ‌న దేశంలో ప్ర‌తి నెలా 1800 కోట్ల‌కు పైగా యూపీఐ లావాదేవీలు 
  • 2016లో యూపీఐను ప్రారంభించిన ఎన్‌పీసీఐ
  • దేశ చెల్లింపుల‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల్లో ప్ర‌పంచంలోనే భార‌త్ టాప్‌గా నిలిచింద‌ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తెలిపింది. 'గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ చెల్లింపులు: ది వాల్యూ ఆఫ్ ఇంటర్‌ఆపరబిలిటీ' పేరిట‌ ఐఎంఎఫ్‌ ఇటీవల విడుదల చేసిన నోట్ ప్రకారం యూపీఐ వేగవంతమైన వృద్ధి కారణంగా భారత్‌ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నేడు మ‌న దేశంలో ప్ర‌తి నెలా 1800 కోట్ల‌కు పైగా యూపీఐ లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని ఐఎంఎఫ్ పేర్కొంది.  

2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రారంభించిన యూపీఐ, వినియోగదారులు బహుళ బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ యాప్‌కి లింక్ చేయడానికి, తక్షణ లావాదేవీలను సులభంగా చేయడానికి వీలు కల్పించింది. త‌ద్వారా దేశ చెల్లింపుల‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

ఇది వ్య‌క్తి నుంచి వ్య‌క్తి(పీర్-టు-పీర్)కి చెల్లింపులను సరళీకృతం చేయడంతో పాటు లక్షలాది చిన్న వ్యాపారాలు తక్కువ ఖర్చుతో డిజిటల్ చెల్లింపులు చేయ‌డానికి వీలు కల్పించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) డేటా ప్రకారం, UPI ఇప్పుడు ప్రతి నెలా 18 బిలియన్లకు పైగా లావాదేవీలను జ‌రుపుతోంది. ఇది భారతదేశ మొత్తం డిజిటల్ చెల్లింపులలో 85 శాతం వాటాను కలిగి ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఏడాది జూన్ నెలలోనే రూ.24.03 లక్షల కోట్ల విలువైన 18.39 బిలియన్ లావాదేవీలను యూపీఐ నమోదు చేసింది. ఇది గత సంవత్సరం జూన్‌తో పోలిస్తే 32 శాతం పెరుగుదలను న‌మోదు చేసింది. 49.1 కోట్ల మంది సామాన్య ప్ర‌జ‌లు, 6.5 కోట్ల‌ వ్యాపారులు ఈ యూపీఐ సేవ‌ల‌ను వినియోగిస్తున్నారు. 675 బ్యాంకులను ఒకే డిజిట‌ల్ ఫ్రేమ్‌వ‌ర్క్ ద్వారా యూపీఐ క‌లుపుతోంది.

"భారత్ లో ఇప్పుడు నగదు, కార్డు ఆధారిత చెల్లింపులతో పోలిస్తే డిజిట‌ల్ పేమెంట్లు అధికంగా జ‌రుగుతున్నాయి. లక్షలాది ప్ర‌జ‌లు, చిన్న వ్యాపారులు ఇప్పుడు సురక్షితమైన లావాదేవీల కోసం యూపీఐపైనే ఆధారపడుతున్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మెరుగుప‌డ‌డానికి యూపీఐ ఒక శ‌క్తివంత‌మైన సాధ‌నంగా మారింది" అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పేర్కొంది. 
UPI Payments
Unified Payments Interface
IMF
International Monetary Fund
Digital Payments India
NPCI
National Payments Corporation of India
Digital Economy India
Online Transactions India
Mobile Payments

More Telugu News