ISKCON: ఇస్కాన్ ప్రార్థనా మందిరంలో కేఎఫ్‌సీ చికెన్ తిన్న వ్యక్తి... నెటిజన్ల ఫైర్

ISKCON Restaurant Incident Man Eats KFC Chicken Sparks Outrage
  • లండన్ లో ఘటన
  • ఇస్కాన్ రెస్టారెంట్ లోకి ప్రవేశించిన ఆఫ్రికన్-బ్రిటీష్ సంతతి యువకుడు
  • ఇది శాకాహార రెస్టారెంటా అని అడిగి మరీ తన బ్యాగ్ లోంచి చికెన్ తీసిన వైనం
లండన్‌లోని ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా'స్ కాన్షస్‌నెస్) ధార్మిక సంస్థ నడుపుతున్న ప్రసిద్ధ శాకాహార రెస్టారెంట్ గోవిందాలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆఫ్రికన్-బ్రిటిష్ సంతతికి చెందిన ఒక యువకుడు ఈ రెస్టారెంట్‌లోకి ప్రవేశించి, ఇది శాకాహార రెస్టారెంటా అని సిబ్బందిని అడిగాడు. అక్కడ మాంసాహారం అందుబాటులో లేదని, కేవలం శాకాహార ఆహారం మాత్రమే సర్వ్ చేస్తామని సిబ్బంది స్పష్టం చేసినప్పటికీ, ఆ యువకుడు తన బ్యాగ్ నుంచి కేఎఫ్‌సీ చికెన్ బాక్స్ తీసి, అక్కడే తినడం ప్రారంభించాడు. అంతేకాక, సిబ్బంది మరియు ఇతర కస్టమర్లకు కూడా చికెన్ ఆఫర్ చేస్తూ, "ఫ్రీ ది చికెన్!" అంటూ గట్టిగా కేకలు వేశాడు. మాంసం లేదు, ఉల్లిపాయలు లేవు, వెల్లుల్లి లేదు... అంటూ వ్యాఖ్యానించాడు.

ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నెటిజన్ ఈ చర్యను "హిందూ మతం పట్ల ద్వేషం లేదా జాత్యాంహకారం" అని విమర్శించగా, మరొకరు "ఇది హిందూ సంస్కృతి పట్ల బహిరంగ అగౌరవం" అని పేర్కొన్నారు. ఈ యువకుడు తన చర్యను ముందస్తు ప్రణాళికతో, కెమెరామెన్‌తో కలిసి చేసినట్లు కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. "ఇది సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం చేసిన హీనమైన చర్య" అని ఒక యూజర్ వ్యాఖ్యానించాడు.

ఇస్కాన్ రెస్టారెంట్‌లు హిందూ సంప్రదాయాల ఆధారంగా శాకాహారాన్ని ప్రోత్సహిస్తాయి, మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి వాడటం కచ్చితంగా నిషేధం. ఈ సంఘటనను చాలా మంది ధార్మిక సంస్కృతికి అగౌరవంగా భావించారు. సిబ్బంది ఆ యువకుడిని బయటకు వెళ్లమని కోరినప్పటికీ, అతను నిరసనగా మరింత గందరగోళం సృష్టించాడు. చివరకు సెక్యూరిటీ సహాయంతో అతన్ని రెస్టారెంట్ నుంచి బయటికి పంపించారు.
ISKCON
ISKCON London
Govinda's Restaurant
KFC Chicken
Vegetarian Restaurant
Hinduism
Religious disrespect
Social media
Viral video
Free the chicken

More Telugu News