Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం: మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్

Mithun Reddy Remanded Until August 1 in AP Liquor Scam
  • ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
  • నిన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్
  • నేడు కోర్టులో హాజరు
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు నిన్న అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నారు. దాదాపు 7 గంటల విచారణ అనంతరం శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మిథున్‌రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్‌ విధించింది. 

కోర్టులో మిథున్ రెడ్డి తరఫున న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించగా, సిట్ తరఫున కోటేశ్వరరావు వాదనలు వినిపించారు. తాము కస్టడీకి కోరుతున్నందున మిథున్ రెడ్డిని గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ కు పంపాలని సిట్ కోరగా, మిథున్ రెడ్డి ఓ ఎంపీ అని, ఆయనకు వై కేటగిరీ భద్రత ఉందని, ఆయనకు నెల్లూరు జిల్లా జైలులో ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని న్యాయవాది నాగార్జునరెడ్డి కోరారు. పైగా మిథున్ రెడ్డి పార్లమెంటులో ప్యానెల్ స్పీకర్ గా చేశారని, ఆయన అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇవ్వాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది.

మద్యం కుంభకోణం కేసులో మిథున్‌రెడ్డి ప్రధాన కుట్రదారుల్లో ఒకరని, లిక్కర్‌ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల సరఫరా వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారని సిట్‌ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్‌ చేసిన సిట్‌, మిథున్‌రెడ్డితో సహా మొత్తం 40 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. 

ఈ కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు సుమారు 3,200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసును సృష్టించారని, ‌వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, సిట్‌ మాత్రం ఈ కేసులో గట్టి ఆధారాలు సేకరించినట్లు పేర్కొంది.


Mithun Reddy
AP Liquor Scam
Andhra Pradesh
YSRCP
SIT investigation
Chandrababu Naidu
Liquor policy
Corruption case
Nellore jail
ACB Court

More Telugu News