India Alliance: పహల్గామ్ ఉగ్రదాడి.. ట్రంప్ వ్యాఖ్యలు.. బీహార్ ఓటర్ లిస్ట్.. ఇండియా కూటమి వ్యూహం ఇదే!

India Alliance Strategy on Pahalgam Attack Trump Remarks Bihar Voter List
  • రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలపై ఇండియా కూటమి సమావేశం చర్చ
  • తమ ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెబుతారని కూటమి నేతల ఆశాభావం
24 ప్రతిపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా పహల్గామ్ ఉగ్రదాడికి న్యాయం జరగకపోవడం, భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు, బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వంటి అంశాలను లేవనెత్తనుంది.

ఇండియా కూటమి నేతలు నిన్న వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 8 అంశాలను ప్రస్తావించారు. వీటిలో భారత విదేశాంగ విధానంలో వైఫల్యాలు, గాజా సంక్షోభం, డీలిమిటేషన్, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలపై దౌర్జన్యాలు పెరగడం తదితర అంశాలున్నాయి. 

సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ఉపనేత ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. వర్షాకాల సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారని, తాము లేవనెత్తే కీలక అంశాలపై ఆయన నేరుగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘విదేశీ పర్యటనల కంటే పార్లమెంట్ చాలా ముఖ్యం’ అని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరించడం ప్రతిపక్షాలకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. ఇండియా కూటమి నేతలు ఆగస్టులో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్టు ప్రకటించారు.
India Alliance
Pahalgam Terrorist Attack
Donald Trump
Bihar Voter List
Parliament Monsoon Session
Indian Foreign Policy
Gaza Crisis
Delimitation
Narendra Modi

More Telugu News