మరో నయీంలా మైనంపల్లి వ్యవహరిస్తున్నారు: దాసోజు శ్రవణ్

  • బీఆర్ఎస్ కార్యకర్తలను మైనంపల్లి భయాందోళనలకు గురి చేస్తున్నారన్న శ్రవణ్
  • కేటీఆర్ పై, బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్న శ్రవణ్
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరో నయీం మాదిరి మైనంపల్లి వ్యవహరిస్తూ... బీఆర్ఎస్ కార్యకర్తలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో రౌడీయిజానికి అడ్డూ అదుపూ లేదని చెప్పడానికి మల్కాజ్ గిరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని అన్నారు. 

బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. ఇది రౌడీ పాలనా? లేక ప్రజాపాలనా? అనేది సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైనంపల్లిలో మార్పు వస్తుందేమోనని ఇన్నాళ్లు ఎదురు చూశామని... కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. ఈరోజు గాంధీభవన్ లో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.

చీమలపుట్టలోకి పాములు చొరబడనట్టు మల్కాజిగిరిలోకి మైనంపల్లి చొరబడి రౌడీయిజం చేస్తున్నాడని మండిపడ్డారు. మైనంపల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన కాళ్లు మొక్కిన మైనంపల్లి.... ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 


More Telugu News