Warren Buffett: తెలివిగా ఖర్చు చేయడమే చాలా ముఖ్యం.. వారెన్ బఫెట్ చెప్పిన పొదుపు సూత్రాలు

Warren Buffett on smart spending habits
  • అవసరానికి, ఆడంబరానికి తేడా గుర్తించాలి
  • ఖర్చులన్నీ పోయాక మిగిలింది పొదుపు కాదు..
  • పొదుపు చేశాకే ఖర్చు చేయాలంటున్న బఫెట్
ఒక రూపాయి పొదుపు చేయడమంటే ఆ రూపాయిని సంపాదించినట్లేనని పెద్దలు చెబుతుంటారు. సంపాదన ఎంత ఉన్నప్పటికీ పొదుపుగా ఉంటే ధనవంతులుగా మారొచ్చని, ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలని వారెన్ బఫెట్ చెబుతున్నారు. ప్రతీ వ్యక్తికీ ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని అంటున్నారు. సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నామనేది మరింత ముఖ్యమని ఆయన తెలిపారు. మరీ ముఖ్యంగా.. అవసరానికి, ఆడంబరానికి తేడా తెలుసుకుని ఖర్చు చేయాలని యువతకు సూచిస్తున్నారు. ఎక్కడ డబ్బు వృథా చేయకూడదో తెలిసిన వాడే డబ్బును కాపాడగలడని ఆయన చెప్పారు. ఖర్చులన్నీ చేశాకే పొదుపు చేస్తామనడం మంచి పొదుపరుల లక్షణం కాదని, పొదుపు చేశాకే ఖర్చుల లెక్క చూసుకోవాలని బఫెట్ చెబుతున్నారు.

సొంతింటి కల నెరవేర్చుకోవడం..
ఉద్యోగంలో చేరాక చాలామంది సొంతింటి కోసం ఆలోచనలు చేస్తుంటారు. సొంతింట్లో ఉంటే ఆ సంతోషమే వేరు. అయితే, ఇల్లు కొనుగోలు చేయడంలోనూ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని బఫెట్ సూచిస్తున్నారు. చిన్న కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు సరిపోతుంది, కానీ డబ్బు ఉందనో లేక బంధుమిత్రుల ముందు గొప్పతనం కోసమో మూడు, నాలుగు బెడ్రూంలు ఉన్న ఇల్లు తీసుకోవడం సరికాదని చెప్పారు. అవసరానికి మించిన ఇంటిని కొనుగోలు చేస్తే.. దానికి మెయింటెన్స్‌, ట్యాక్సులు, ఈఎంఐ.. ఇలా పెద్ద మొత్తంలో ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇల్లు అవసరానికి సరిపోయేలా ఉండాలి కానీ మన దర్పాన్ని చూపించుకోవడానికి కాదని వివరించారు.

క్రెడిట్ కార్డు..
ఉద్యోగస్తులకు బ్యాంకులు వెంటపడి మరీ ఇచ్చే క్రెడిట్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బఫెట్ చెప్పారు. షాపింగ్ కోసం కార్డును వాడడం ఎంత సులభమో.. నెలాఖరున ఆ మొత్తం చెల్లించడం అంత ప్రయాసనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలివిగా వాడుకుంటే క్రెడిట్ కార్డుతో చాలా ప్రయోజనం ఉంటుందన్నారు. లేదంటే క్రెడిట్ కార్డే అప్పుల ఊబిలోకి నెడుతుందని హెచ్చరించారు.
 
కారు కొనుగోలు..
సొంత కారులో తిరగాలనేది చాలామంది కల.. ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న వాహన రుణాలతో ఈ కలను నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే, ఇప్పుడు కారు అవసరమా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలని బఫెట్ చెబుతున్నారు. జీతం పెరిగిందనో, స్థోమత వచ్చిందనో వెంటనే కారు కొనుగోలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఒకసారి షోరూంలో నుంచి కారు బయటకు వచ్చిందంటే రోజురోజుకూ దాని విలువ తరిగిపోతూ ఉంటుందనే విషయం గుర్తించాలన్నారు. ఐదేళ్లలోనే దాని విలువ దాదాపుగా 60 శాతం మేర పడిపోతుందని చెబుతారు. అంటే కారుపై పెట్టిన పెట్టుబడి (ఖర్చు) తరిగిపోతుందని వివరించారు. మన పెట్టుబడులు ఎప్పుడూ వాటి విలువ పెంచే వాటిలో ఉండాలే తప్ప.. తగ్గించే వాటిలో కాదని బఫెట్ చెప్పారు. రోజుకో కొత్త కారులో తిరిగే స్తోమత ఉన్న బఫెట్ ఇప్పటికీ 2014లో కొనుగోలు చేసిన కారులోనే తిరుగుతుంటారు. బఫెట్ ఆ కారును కూడా డిస్కౌంట్ లో కొన్నారట.
 
జూదం జోలికి వెళ్లొద్దు..
ఆరు రూపాయల లాటరీతో ఓ సామాన్యుడు కోటి రూపాయలు గెల్చుకున్నాడని తాజాగా ఓ వార్త మీడియాలో వైరల్ గా మారింది. ఇలా లాటరీలు, జూదంలో పెద్ద మొత్తంలో గెలుచుకునే అవకాశం ఉందని చాలామంది అటువైపు మొగ్గుతుంటారు. కానీ అది ఆరోగ్యకరం కాదని, జూదంలో గెలుచుకునే అవకాశం అతి స్వల్పమని బఫెట్ అంటున్నారు. ఆ అదృష్టం దక్కేది కేవలం 10 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే అని వివరించారు. జూదంలో పోగొట్టుకోవడమే తప్ప పొందేది ఏమీ ఉండదని చెప్పారు.
 
సొంత అవగాహనతో పెట్టుబడులు
ఎవరు చెప్పినా సరే తెలియని పథకాల్లో పెట్టుబడులు పెట్టవద్దని బఫెట్ సూచిస్తున్నారు. సొంతంగా అవగాహన చేసుకున్నాకే పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. మీరు పెట్టుబడి చేస్తున్న పథకం అసలు మీకు అర్థమే కాకపోతే మీ డబ్బును రిస్క్‌లో పెడుతున్నట్లేనని అన్నారు. రిటర్న్స్ ఎక్కువ అనే పదం వెనక రిస్క్ కూడా ఎక్కువేననే విషయం దాగి ఉందని బఫెట్ గుర్తించాలన్నారు.
Warren Buffett
Warren Buffett savings tips
saving money
personal finance
investment tips
credit card debt
home buying
car purchase
gambling
financial planning

More Telugu News