Fish Venkat: చేప‌లు అమ్ముకునే స్థాయి నుంచి న‌టుడిగా.. టాలీవుడ్‌లో ఫిష్ వెంక‌ట్ ప్ర‌స్థానం

Fish Venkat Journey From Fish Seller To Actor
  • అనారోగ్యంతో క‌న్నుమూసిన ఫిష్ వెంకట్ 
  • ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో ఇటీవ‌ల ఆసుప‌త్రిలో చేరిక‌
  • ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి
  • చిన్నతనంలోనే హైదరాబాద్‌కు వలస
  • ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్ముతూ జీవ‌నం
  • సినిమాలంటే పిచ్చి.. ఆ ఆసక్తితోనే సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న‌ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో క‌న్నుమూశారు. 

ఫిష్ వెంకట్‌కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దాంతో కొంత‌కాలంగా డయాలసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ త‌ర్వాత ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో ఇటీవ‌ల ఆసుప‌త్రిలో చేరారు. అప్పుడే ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌నే విష‌యం బ‌య‌ట‌కు తెలిసిందే. వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. కానీ, స‌మ‌యానికి సరైన దాతలు దొరకకపోవడం విషాదకరంగా మారింది. 

చేప‌లు అమ్ముకునే స్థాయి నుంచి న‌టుడిగా
ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేశ్‌. 1971 ఆగస్టు 3న ఏపీలోని మచిలీపట్నంలో జన్మించారు. అయితే, చిన్నతనంలో హైదరాబాద్‌కు వలస వచ్చారు. ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్మే వ్యాపారం చేస్తూ జీవ‌నం సాగించేవారు. అందుకే ఫ్యాన్స్‌, సహచరులు ఆయనను 'ఫిష్ వెంకట్' అని పిలిచేవారు. 

కాగా, మూడవ తరగతి వరకే చదివిన వెంకట్‌కు సినిమాలంటే పిచ్చి. ఆ అపారమైన ఆసక్తితో సినిమాల్లోకి వ‌చ్చారు. దివంగత నటుడు శ్రీహరి ద్వారా వెంకట్‌ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయ‌న‌ను దర్శకుడు వీవీ వినాయక్ సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. 2002లో విడుదలైన తార‌క్‌ నటించిన 'ఆది' మూవీలో చెప్పిన డైలాగ్ “ఒక్కసారి తొడకొట్టు చిన్నా”తో ఫిష్ వెంకట్ ప్రజల మదిలో నిలిచిపోయారు. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన‌ 'గ‌బ్బ‌ర్ సింగ్' మూవీలో కూడా త‌నదైన‌ కామెడీ టైమింగ్‌తో కిత‌కిత‌లు పెట్టారు. 

ఇలా 100కి పైగా సినిమాల్లో విల‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా మెప్పించారు. తెలంగాణ యాస, విలక్షణమైన హావభావాలు, కామెడీ టైమింగ్ ఆయన నటనలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. చిన్న పాత్రల్లో కనిపించినా, ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. ఆయ‌న మృతితో టాలీవుడ్ ఓ మంచి న‌టుడిని కోల్పోయింది. ఫిష్ వెంకట్ మృతిపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియ‌జేస్తున్నారు. 
Fish Venkat
Mungilampalli Venkatesh
Telugu actor
Tollywood
death
kidney failure
Srihari
VV Vinayak
Gabbar Singh

More Telugu News