Revanth Reddy: రేవంత్ రెడ్డి దెబ్బకి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

MP Chamala Kiran Slams KCR Over Revanth Reddy Impact
  • మూడోసారి అధికారంలోకి వచ్చి కేసీఆర్ కుటుంబం దోచుకోవాలని కలలు కన్నదని ఆరోపణ
  • కేదార్ అనే వ్యక్తి దుబాయ్‌లో డ్రగ్స్ కారణంగా చనిపోయాడన్న చామల
  • కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపించిన ఎంపీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత దోచుకోవచ్చని కలలు కన్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేదార్ అనే వ్యక్తి దుబాయ్‌లో డ్రగ్స్ కారణంగా చనిపోయినట్లు తేలిందని అన్నారు. ఆయనకు కేటీఆర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. దుబాయ్‌లో కేదార్‌తో పెట్టుబడులు పెట్టించింది ఎవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో తప్పేముందో చెప్పాలని నిలదీశారు.

బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు చర్చ లేకుండా అసెంబ్లీని నడిపారని, మంత్రులకే తెలియకుండా గతంలో జీవోలు చేశారని ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించిందని, నీటి పంపకాలపై నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు రప్పించినట్లు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిందని తెలిపారు. కానీ దానిని పక్కన పెట్టి బనకచర్ల గురించి మాట్లాడారని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
Revanth Reddy
KCR
Chamala Kiran Kumar Reddy
Telangana Politics
BRS
KTR
Drugs Case

More Telugu News