KTR: లోకేశ్ నీలాగా చదువు లేని వాడు కాదు... రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

KTR Counters Revanth Reddys Allegations of Ties With Nara Lokesh
  • లోకేశ్ పక్క రాష్ట్ర మంత్రి.. తమ్ముడి లాంటి వారన్న కేటీఆర్
  • నాపై చేసే ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరికీ లాభం లేదని ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తనకు మంచి మిత్రుడు అని, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాను లోకేశ్‌ను కలిశానని చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కలిసినా తప్పేమిటని ప్రశ్నించారు. లోకేశ్ పక్క రాష్ట్ర మంత్రి అని, తమ్ముడి లాంటి వాడని అన్నారు.

ఏపీ మంత్రి లోకేశ్‌ ను కేటీఆర్ రహస్యంగా కలిశాడంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 

"నేనేదో లోకేశ్‌ను అర్ధరాత్రి కలిశానట. నేను ఏం చేసినా బాజాప్తా చేస్తాను. అయినా లోకేశ్ నీలాగ ఏమైనా అంతర్రాష్ట్ర దొంగనా? లోకేశ్ ఏమైనా నీలాగా సంచులు మోసిన వ్యక్తా? లోకేశ్ నీలా చదువు రాని వాడు కాదు కదా" అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "లోకేశ్ మీ పెద్ద బాస్ చంద్రబాబు కొడుకే కదా.. నేనేదో గూండానో, దావూద్ ఇబ్రహీంనో చీకట్లో కలిసినట్లు డైలాగ్‌లు ఏందిరా హౌలా?" అంటూ దుయ్యబట్టారు.

నేను దొంగనేమీ కలవలేదని, అయినా నీలా ఢిల్లీలో లోఫర్ రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు. చీకట్లో వెళ్లి అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నానా, మోదీకి ప్రణమిల్లుతున్నానా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పాలన గురించి తెలుసుకోవాలంటే బీఆర్ఎస్‌ను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే మాత్రం మీ వద్దకు రావాలని ఎద్దేవా చేశారు.

ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని, చివరకి గుండు సూదంత ఆధారం కూడా చూపలేకపోయారని విమర్శించారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే తనకు సంబంధం అంటగట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి ధైర్యం ఉంటే, ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఎన్నో నిరాధార ఆరోపణలు చేశారని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని కేటీఆర్ అన్నారు. తాను ఏం పని చేసినా బాహాటంగానే చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గత 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు తప్ప, రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. తన విషయానికి వచ్చేసరికి ఒకసారి డ్రగ్స్ అంటారని, మరోసారి కారు రేసింగ్ అంటారని ఆయన మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న నిరాధార వ్యాఖ్యల వల్ల యూట్యూబర్లకు తప్ప ఎవరికీ లాభం లేదని కేటీఆర్ అన్నారు. ప్రజలు గాసిప్స్ మాయలో పడి ఆరు గ్యారెంటీలను మరిచిపోతున్నారని ఆయన అన్నారు. బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన భేటీలో బనకచర్ల అంశం ప్రస్తావనకు రాలేదని ముఖ్యమంత్రి అబద్ధం చెప్పారని ఆయన అన్నారు. అంతేకాకుండా, చంద్రబాబుతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. 420 హామీలపై కాంగ్రెస్ పార్టీతో ఫుట్‌‍బాల్ ఆడటం ఖాయమని ఆయన హెచ్చరించారు.

KTR
Nara Lokesh
Revanth Reddy
Telangana Politics
Andhra Pradesh
BRS
Congress Party

More Telugu News