AAIB: ఎయిరిండియా విమాన ప్రమాదం.. నిరాధార వార్తలపై స్పందించిన ఏఏఐబీ

AAIB Responds to Baseless Reports on Air India Flight Accident
  • ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్న ఏఏఐబీ
  • అప్పుడే నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుందన్న ఏఏఐబీ
  • మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టీకరణ
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన నివేదికపై విభిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏఏఐబీ స్పందించింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై ఇప్పుడే ఒక నిర్ధారణకు రావడం తొందరపాటు చర్య అవుతుందని అభిప్రాయపడింది. ఎయిరిండియా విమానం పైలట్ ఇంధన స్విచ్‌ను షట్ డౌన్ చేశారంటూ కొన్ని మీడియా కథనాలు ప్రచురించాయి.

దీనిపై ఏఏఐబీ స్పందిస్తూ, కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు నిరాధార, ధృవీకరించని నివేదికల ద్వారా విమాన ప్రమాదంపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఇటువంటి చర్యలు బాధ్యతారాహిత్యమైనవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

నిరాధార సమాచారంతో భారత విమానయాన రంగం భద్రత పట్ల ప్రజల్లో ఆందోళనను సృష్టించేందుకు ఇది తగిన సమయం కాదని ఏఏఐబీ పేర్కొంది. ప్రమాదానికి గల మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదికను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు విశ్వసనీయతను దెబ్బతీసే కథనాలను వ్యాప్తి చేయవద్దని సూచించింది.
AAIB
Air India
Air India Flight Accident
Ahmedabad
GVG Yugandhar
Flight Accident Investigation Bureau

More Telugu News