Nadendla Manohar: 10 శాతం విరిగిన బియ్యం సరఫరాకు సువర్ణ అవకాశం: మంత్రి నాదెండ్ల

Nadendla Manohar Calls for Rice Millers to Supply 10 Percent Broken Rice
  • కానూరులో రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి నాదెండ్ సమావేశం
  • ధాన్యం సేకరణ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని వెల్లడి
  • కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉందని వివరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యాల ప్రకారం, కేంద్రానికి (FCI) కస్టమ్ మిల్లింగ్ రైస్ ను 10 శాతం బ్రోకెన్ (విరిగిన) బియ్యంతో సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు సిద్ధం కావాలని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

ఈరోజు విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన రైస్ మిల్లర్ల ప్రతినిధులతో జరిగిన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాలలో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేకరించడం ద్వారా పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు హర్యానా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 10 శాతం బ్రోకెన్ రైస్‌ను సేకరించేందుకు లక్ష్యాలు ఇచ్చారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ ను 10 శాతం బ్రోకెన్ రైస్‌ తో కేంద్రానికి సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్లు వారి సంసిద్ధతను స్పష్టమైన ప్రతిపాదనల ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు. 

ఇతర రాష్ట్రాలతో పోటీపడి బియ్యం అందించడంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి రైస్ మిల్లర్లకు పిలుపునిచ్చారు. సంబంధిత రైస్ మిల్లర్లు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి, సరఫరా చేయాల్సిన CMR బియ్యంలో బ్రోకెన్ శాతం 10 శాతం మించకుండా చూసుకోవాలన్నారు. నిబంధనల మేరకు రైస్ మిల్లులు అవసరమైన టెస్టింగ్, ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్ట్ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసి, ఇచ్చిన గడువులోగా సరఫరా చేయాలని ఆయన సూచించారు.

నాణ్యమైన బియ్యాన్ని కేంద్రానికి సమయానికి అందించడం వల్ల రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని, 'బ్రాండ్ ఆంధ్రప్రదేశ్' పేరు నిలబెట్టేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆయన అన్నారు. సరఫరా ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా, సంబంధిత అధికారులు మరియు మిల్లర్లు సమన్వయంతో ముందడుగు వేయాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. 

ఈ సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్ ఐఏఎస్, సివిల్ సప్లై ఎండీ మానవీర్ జిలానీ ఐఏఎస్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
Nadendla Manohar
Rice Millers
Custom Milling Rice
Broken Rice
Andhra Pradesh
FCI
Civil Supplies
Procurement

More Telugu News