ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది: సీఎం చంద్రబాబు

  • హంద్రీ నీవా నీళ్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద రెండు మోటార్లు ఆన్ చేసిన వైనం
  • రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ప్రత్యేకమేనని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  హంద్రీ-నీవా సుజల శ్రావంతి (HNSS) ఫేజ్-1 కాలువల నీటిని విడుదల చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద గురువారం నాడు రెండు మోటార్లను ఆన్ చేసి, శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ నుంచి కృష్ణా నది జలాలను రాయలసీమ జిల్లాలకు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు.  దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు.

"మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేసే కార్యక్రమంలో కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమే. రాయలసీమకు జీవనాడి హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు శరవేగంగా చేశాం. మొదటి ఫేజ్ పూర్తి చేసి మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేశాం. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచడం వల్ల సీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. రికార్డు స్థాయిలో ఈ పనులు పూర్తి చేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్ 2 పనులు పూర్తి చేద్దాం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీటిని అందించే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారు. సంపద సృష్టికి మూలమైన జలాన్ని ప్రతి ఎకరాకు అందిచాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో సహకారంతో నేరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం" అని వివరించారు.

హంద్రీ-నీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తయ్యాయి, దీంతో కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని తాగునీటి, సాగునీటి కష్టాలను తీర్చడానికి 40 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉంది. ఈ నీరు నంద్యాల జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ వరకు తరలిస్తారు. గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ లక్ష్యం సాధ్యమైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ కోసం రూ.3,890 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వంద రోజుల్లోనే ఈ పనులను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం, రాయలసీమ ప్రజల నీటి నిరీక్షణను ముగించింది. ఈ ప్రాజెక్ట్ రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యలను కొంతవరకు పరిష్కరిస్తుందని, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. దీని ద్వారా రాయలసీమలోని గొల్లపల్లి, మరాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు నిండనున్నాయి. అలాగే, జీడిపల్లి నీటిని పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించేందుకు 15 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. రాయలసీమలో నీటి సమృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.


More Telugu News