Intel: 4 వేల మంది కాదు.. 5 వేల మందిని తొలగిస్తున్నాం: ఇంటెల్‌

Intel Layoffs 5000 Employees to be Cut Across US
  • ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చిన చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌
  • అమెరికా అంతటా 5వేల‌ మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్స్‌
  • ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగానే తొల‌గింపులని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • ఒరెగాన్‌, కాలిఫోర్నియాలో అధికంగా లేఆఫ్స్‌ ఉంటాయని వెల్ల‌డి
ప్ర‌ముఖ చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ (Intel) తన ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చింది. ఈ వారంలో అమెరికా అంతటా 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇంటెల్ ధృవీకరించింది. కాగా, ఇంటెల్‌ 4 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించనున్నట్లు ఇటీవలే అంచనాలు వెలువడిన సంగ‌తి తెలిసిందే. అయితే, 4 వేల మంది కాదని, 5 వేల మందిని తొలగిస్తున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. 

ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా లేఆఫ్స్‌ అమలు చేస్తున్నట్లు స్ప‌ష్టం చేసింది. ఒరెగాన్‌, కాలిఫోర్నియాలో అధికంగా తొలగింపులు ఉంటాయని వెల్ల‌డించింది. ఇందులో కాలిఫోర్నియా ఆఫీస్‌ నుంచి 1,935 మంది, ఒరెగాన్ యూనిట్‌ నుంచి 2,392 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నట్లు స‌మాచారం. అటు, ఈ చిప్‌మేకర్ తన అరిజోనా కార్యాలయంలో తొలగింపుల సంఖ్యను 696కి పెంచడం గ‌మ‌నార్హం. 

చిప్ డిజైన్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్, తయారీపై పనిచేసే ఇంజనీర్లతో పాటు వ్యాపార అధిపతులు, ఐటీ వైస్ ప్రెసిడెంట్ వంటి కొంతమంది సీనియర్ ఉద్యోగులు కూడా లేఆఫ్స్ ను ఎదుర్కొంటున్న ఉద్యోగుల జాబితాలో ఉన్నట్లు తెలిసింది. ఇక‌ ఈ లేఆఫ్స్‌... కంపెనీ గతంలో చేసిన తొలగింపుల మాదిరిగానే జరిగితే, వాటిని స్వచ్ఛంద నిష్క్రమణలుగా లేదా ముందస్తు పదవీ విరమణలుగా పరిగణిస్తారు. ప్రభావిత ఉద్యోగులకు తొమ్మిది వారాల జీతం, ఇత‌ర ప్రయోజనాలతో పాటు 60 రోజుల లేదా నాలుగు వారాల నోటీసు పీరియ‌డ్‌ కూడా లభిస్తుంది. 

ఈ ఏడాది మార్చిలో ఇంటెల్‌ కొత్త సీఈఓగా లిప్-బు టాన్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్న ఇంటెల్, తన ఉద్యోగుల్లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా లేఆఫ్స్‌ను ప్రకటించింది.

కాగా, 2024లో ఇంటెల్ 15,000 మంది ఉద్యోగులను తొలగించిన విష‌యం తెలిసిందే. ఇక‌, సిబ్బందిని తొలగించాలనే నిర్ణయం, అన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే తీసుకున్నామని, ప్రభావితమైన వారిని జాగ్రత్తగా, గౌరవంగా చూస్తామని సంస్థ‌ ఇటీవల ఒక ప్రకటన ద్వారా హామీ ఇచ్చింది.
Intel
Intel layoffs
Intel employee layoffs
Lip-Bu Tan
Oregon
California
Chip manufacturing
Job cuts
Technology layoffs
Intel restructuring

More Telugu News