Virat Kohli: బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. నివేదికలో కోహ్లీ పేరు

Bangalore Stampede Report Blames RCB Invitation with Virat Kohli Video
  • ఐపీఎల్ ట్రోఫీని తొలిసారి గెలుచుకున్న సందర్భంగా ఆర్సీబీ విక్టరీ పరేడ్
  • పాల్గొనాలంటూ అభిమానులకు ఆహ్వానం
  • అదే కొంపముంచిందన్న నివేదిక
  • హైకోర్టుకు సమర్పించిన ప్రభుత్వం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ తొలి ఐపీఎల్ టైటిల్ విజయాన్ని జరుపుకొనేందుకు నిర్వహించిన విజయోత్సవ పరేడ్ సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసుల అనుమతి లేకుండా ఆర్సీబీ ప్రజలను ఆహ్వానించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని ఆరోపించింది.

నివేదిక ప్రకారం.. ఆర్సీబీ జూన్ 4 ఉదయం 7:01 గంటలకు సోషల్ మీడియాలో ఉచిత ప్రవేశంతో విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు జరిగే విజయోత్సవ పరేడ్‌లో పాల్గొనాలంటూ ఆహ్వానం పోస్ట్ చేసింది. ఉదయం 8:55 గంటలకు ఆర్సీబీ అధికారిక ఖాతాలో విరాట్ కోహ్లీ వీడియో కూడా పోస్ట్ అయింది. ఇందులో ఆయన బెంగళూరు ప్రజలతో కలిసి విజయాన్ని జరుపుకోవాలని అభిమానులను ఆహ్వానించాడు. ఈ పోస్ట్‌లను 44 లక్షల మంది వీక్షించారు. దీంతో 2-3 లక్షల మంది అభిమానులు స్టేడియం వద్ద గుమిగూడారు. స్టేడియం సామర్థ్యం కేవలం 35,000 మాత్రమే కావడంతో, గేట్ నంబర్లు 1, 2, 21 వద్ద అభిమానులు గేట్లను బద్దలు కొట్టడం వల్ల తొక్కిసలాట జరిగింది.

స్టేడియం సమీపంలోని ఒక డ్రైన్‌పై ఉంచిన తాత్కాలిక స్లాబ్ జనం బరువుకు తాళలేక కూలిపోవడం కూడా ఈ ఘటనకు కారణమైందని నివేదిక తెలిపింది. ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), ఈవెంట్ నిర్వాహకులైన డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు గేట్ నిర్వహణ, అభిమానుల నియంత్రణలో విఫలమైనట్టు నివేదిక పేర్కొంది.

పోలీసులు వెంటనే స్పందించి గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గాయపడినవారి ఆరోగ్య పరిస్థితిని విచారించడానికి ఆసుపత్రులను సందర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తుకు ఆదేశించగా, బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు.
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
Bangalore Stampede
Chinnaswamy Stadium
IPL Victory Parade
Karnataka Government
Fan Invitation
Crowd Control
B Dayananda

More Telugu News