Imran Khan: జైల్‌లో నాకైదేనా జరిగితే అతడిదే బాధ్యత: ఇమ్రాన్ ఖాన్

Imran Khan Says Army Chief Asim Munir Responsible if Anything Happens to Him in Jail
  • జైలులో తమ ప్రాధమిక హక్కులు కాలరాస్తున్నారన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పై ఇమ్రాన్ సంచలన ఆరోపణలు
  • తనపై, తన అర్ధాంగి బుప్రా బీబీ పట్ల జైలులో అమానుషంగా వ్యవహరిస్తున్నారన్న ఇమ్రాన్
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. అయితే ఆయన తాజాగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జైలులో తనకు ఏదైనా హాని జరిగితే దానికి ఆర్మీ చీఫ్ అసిమ్ మునీరే కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పీటీఐ పార్టీ కార్యకర్తలకు ఆయన కీలక పిలుపునిచ్చారు. తాను జైలు జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ ఎప్పటికీ నిరంకుశత్వానికి తలొగ్గేది లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఏడాది ఆగస్టు 5న దేశ వ్యాప్త నిరసనలకు పీటీఐ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రతి పార్టీ సభ్యుడు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఈ నిరసనలో పాల్గొనాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. తన సందేశాలను సామాజిక మాధ్యమాల్లో రీట్వీట్ చేసి తన గొంతును మరింతగా వినిపించాలని ఇమ్రాన్ విజ్ఞప్తి చేశారు.

తన అర్ధాంగి బుష్రా బీబీ పట్ల జైలులో అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సైనిక అధికారి జైలులో వీఐపీ ట్రీట్మెంట్ పొందుతున్నాడని, దోషులుగా తేలిన ఉగ్రవాదుల కంటే కూడా తనను దారుణంగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అణిచివేతలకు గురి చేసినా తాను మాత్రం తలవంచనని స్పష్టం చేశారు. తన భార్య సెల్‌లోని టీవీని కూడా ఆపేశారని, జైలులో తమ ఇద్దరి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. తన పదవీ కాలంలో అసిమ్ మునీర్‌ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించినప్పుడు తన భార్య ద్వారా లాబీయింగ్ చేయాలని ప్రయత్నించాడని, కానీ ఆయనను కలవడానికి ఆమె తీవ్రంగా నిరాకరించిందని తెలిపారు. అప్పటి నుంచి తన అర్ధాంగిపై మునీర్ వ్యక్తిగత కక్ష పెంచుకున్నాడని ఇమ్రాన్ ఆరోపించారు. 
Imran Khan
Asim Munir
Pakistan
PTI
Jail
Protest
Bushra Bibi
Army Chief
Human Rights
ISI Chief

More Telugu News