Pat Cummins: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల హవా!

Pat Cummins Leads Aussie Bowling Domination in ICC Test Rankings
  • తాజాగా బౌలింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ
  • టాప్-10లో సగం మంది ఆసీస్ బౌలర్లే!
  • వెస్టిండీస్ తో సిరీస్ లో అద్భుతంగా రాణించిన కంగారూ బౌలర్లు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అభిమానులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త! ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌ టాప్ 10లో ఏకంగా ఐదుగురు ఆస్ట్రేలియా బౌలర్లు చోటు దక్కించుకున్నారు. ఇది టెస్ట్ క్రికెట్‌లో ఆ జట్టుకున్న పట్టుకు నిదర్శనం. ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్ దళం తిరుగులేని శక్తిగా నిరూపించుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో సగం మంది ఆసీస్ బౌలర్లు ఉండటం విశేషం.

కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లైయన్, మిచెల్ స్టార్క్... ఈ ఐదుగురు బౌలర్లు టెస్ట్ క్రికెట్‌లో తమదైన ముద్ర వేసి, ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. కమిన్స్ 3వ స్థానంలో నిలవగా, అతడి పేస్ భాగస్వామి జోష్ హేజిల్‌వుడ్ 4వ స్థానంలో ఉన్నాడు. ఆసీస్ బౌలింగ్ దళానికి కొత్త బలం చేకూర్చిన స్కాట్ బోలాండ్ 6వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా టెస్ట్ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన నాథన్ లైయన్ 8వ స్థానంలో నిలవగా, ఎడమచేతి వాటం పేసర్ మిచెల్ స్టార్క్ 10వ ర్యాంకులో ఉన్నాడు.

ఈ ఐదుగురు బౌలర్లు విభిన్నమైన నైపుణ్యాలు కలిగినవారు కావడంతో, ఆస్ట్రేలియా ఏ పిచ్‌పై, ఏ పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులను కట్టడి చేయగల సత్తా చాటుతోంది. వారి నిలకడైన ప్రదర్శన, వికెట్లు తీసే సామర్థ్యం ఆస్ట్రేలియాను టెస్ట్ క్రికెట్‌లో అగ్రస్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

తాజాగా వెస్టిండీస్ తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్ లో ఆసీస్ 3-0తో తిరుగులేని విజయం సాధించింది. ముఖ్యంగా, చివరి టెస్టులో విండీస్ 204 పరుగుల లక్ష్యఛేదనకు దిగగా, ఆ జట్టును 27 పరుగులకు ఆలౌట్  చేయడం ఆసీస్ బౌలర్ల పదునుకు నిదర్శనంలా నిలిచింది.

ఇక, ఈ ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో టీమిండియా పేస్ గుర్రం జస్ ప్రీత్ బుమ్రా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఉన్నాడు. 
Pat Cummins
ICC Test Rankings
Australia Cricket
Josh Hazlewood
Scott Boland
Nathan Lyon
Mitchell Starc
Jasprit Bumrah
Kagiso Rabada
Cricket Rankings

More Telugu News